Nara Lokesh Press Conference విశాఖలో నారా లోకేశ్ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 151 నోటీసు ఇచ్చినందున మీడియా సమావేశానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల వైఖరిపై మండిపడ్డ నారా లోకేశ్.. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించట్లేదని తెలిపారు. పోలీసుల తీరుపై లోకేశ్, తెదేపా నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మీడియా సమావేశాన్ని అడ్డుకుని నారా లోకేశ్‌ను పోలీసు వ్యానులో విశాఖ విమానాశ్రయం తరలించారు.
"ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యలు సమర్థనీయం కాదు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించట్లేదు. విశాఖకు గౌరవంగానే వచ్చాను గౌరవంగానే వెళ్తా. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది. కూల్చివేతల జగన్ నిరంకుశ పాలన సాగుతోంది. జగన్.. రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అయ్యన్న ఇంటిని జేసీబీతో కూల్చారు. విశాఖ గీతం వర్సిటీ భూభూగంలోని ప్రహరీ గోడ కూల్చారు. నోటీసులు లేకుండా అర్ధరాత్రి వెళ్లి ప్రహరీ గోడ కూల్చారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై అనేక రకాలుగా పోరాడుతున్నాం. ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు నిలదీస్తే జేసీబీ వస్తోంది. జేసీబీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ నిలుస్తున్నారు."- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
మీ అనుమతి తీసుకోవాలా ?:తన పర్యటన అడ్డుకోవటానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపై పెట్టాలని నారా లోకేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. శాంతిభద్రతలు కాపాడటంపై శ్రద్ధ పెడితే పరిస్థితులు బాగుండేవని హితవు పలికారు. పలాసలో పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకోవటం బాధాకరమన్నారు. కార్యకర్తలను కలవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా ? అని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.