ఏపీలోని గుంటూరులో తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి సోమవారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఆనంద్‌బాబు సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు వైకాపా ప్రభుత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో వసంతరాయపురంలోని ఆనంద్‌బాబు ఇంటికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్థావరాలపై తెలంగాణ పోలీసులు దాడి చేయడం దారుణం. దాడి సమయంలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? గిరిజనులపై దాడి జరిగితే మాట్లాడే హక్కు మాకు లేదా అన్నారు. మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? ప్రస్తుత డీజీపీ కొత్త సంస్కృతి తెస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా?అని ప్రశ్నించారు.