Vinod Kumar Letter: రైల్వే ఉద్యోగ నియామకాలు జోనల్ స్థాయిలో ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినోద్ కుమార్ లేఖ రాశారు. క్లర్కు, అంతకన్న తక్కువ స్థాయి గ్రూప్- సీ, డీ కేటగిరీ ఉద్యోగాలకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం విడ్డూరమన్నారు.
ఆ అల్లర్లు కలచివేశాయి..
జాతీయ స్థాయి పరీక్షల వల్ల బిహార్, ఉత్తరప్రదేశ్లదే పెత్తనం కొనసాగుతోందని.. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగ నియామకాల కోసం ఉత్తరాదిలో మాఫియాలా మారిన కోచింగ్ కేంద్రాల మాయాజాలం వల్ల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. రైల్వేలో 35 వేల పోస్టుల కోసం.. కోటి 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. బిహార్‌లో అల్లర్లు చెలరేగటం.. అది కాస్తా చివరికి రాష్ట్రబంద్ వరకు వెళ్లడం తనను తీవ్రంగా కలిచి వేసిందని లేఖలో వినోద్ కుమార్ వివరించారు.
ఉద్యోగ నియామక ప్రక్రియపై రైల్వే మాజ్దూర్ యూనియన్, మాజ్దూర్ సంఘ్, రైల్వేమెన్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తనతో మాట్లాడారని కేంద్ర మంత్రికి వినోద్ కుమార్ తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ విధానంలో లోపాలపై గతంలో పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించానని గుర్తుచేశారు.
ఇవీ చూడండి: