రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగచేసేలా తీసుకోవాల్సిన చర్యలపై యువత సహా.. అందరూ దృష్టి సారించాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేద్దాం... అనే శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని ప్రశంసించారు. హైదరాబాద్ నాంపల్లి హాకా భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
టీఎస్ విత్తనాభివృద్ధి సంస్థ, టీఎస్ సేంద్రీయ ధ్రువీకరణ సంస్థల 2020 - డైరీలను మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. గ్రామీణాభివృద్ధిలో కీలక వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడంలో భాగంగా నాణ్యమైన పండ్లు, కూరగాయలు, వ్యవసాయోత్పత్తులు అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో కోటి 22 లక్షల 66 వేల ఎకరాల్లో పంటలు సాగు కావడం సంతోషకరవిషయమని ప్రకటించారు.
రుణమాఫీ అమలుచేసి తీరుతాం
ఖరీఫ్ సంబంధించి 94 శాతం రైతులకు రైతుబంధు సాయం అందించామని... త్వరలోనే రబీ సాయం అందిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేసి తీరుతామని అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి... ఆర్థిక మాంద్యం రిత్యా కొంత సమయం పట్టిందన్నారు.
వారే సమాధానం చెప్పాలి
నిజామాబాద్‌లో పసుపు బోర్డు కోసం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత యత్నించారని... ప్రస్తుత ఎంపీ కాగితం రాసిచ్చినందువల్లే రైతులు అడుగుతున్నారన్నారు. ఇది కేంద్రం పరిధి దృష్ట్యా పసుపు బోర్డు, మద్దతు ధర విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమాధానం చెప్పాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఎస్ ఆయిల్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషన్ రాహుల్ బొజ్జ, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయంలో.. తెలంగాణ అగ్రస్థానం.! ఇవీ చూడండి: జలహారతి... మధ్యమానేరులో సీఎం పూజలు