విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. వినాయక ఆలయం దగ్గర నుంచి క్యూలైన్లు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు మీదుగా వేశారు. ఒకసారి క్యూలైన్‌లో ప్రవేశించిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాకే బయటకు వస్తారు. భవానీపురం వైపు నుంచి వచ్చేవారికి కుమ్మరిపాలెం చౌరస్తా నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఐదు లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం సాఫీగా సాగిపోయేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం వైపు నుంచి కిందకు దిగిపోతారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 10వేల మందికే దర్శనాలు కల్పిస్తామంటున్నప్పటికీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానికోసం ముందస్తుగానే టిక్కెట్ కౌంటర్లను.. నగరపాలక సంస్థ, పున్నమిఘాట్, ఘాట్‌రోడ్డులో, కొండ దిగువన ఏర్పాటు చేశారు. ఈ ఏడాది తొమ్మిది రోజులకు కలిపి 10 నుంచి 15 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌లో ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపైన కూడా ఒక కౌంటర్, పున్నమిఘాట్ వద్ద మరో ప్రసాదం కౌంటర్ వీఐపీల కోసం ఉంచారు.
కేశఖండన, జల్లు స్నానం...
కొవిడ్ నేపథ్యంలో ఈసారి కూడా నదీ స్నానాలకు అనుమతించడం లేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అక్కడే భక్తులు జల్లు స్నానాలు చేసేలా 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. క్యూలైన్లలో భక్తులు వెళ్లే సమయంలో వారికి తాగునీటి ప్యాకెట్లను అందిస్తారు. చిన్న పిల్లలకు వేడి పాలను కూడా ఇవ్వనున్నారు.
ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష..