తెలంగాణ

telangana

ETV Bharat / city

Durga Temple: దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి - దుర్గగుడి పాలక మండలి సమావేశం

కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నందున భక్తులను దర్శనాలకు అనుమతిస్తూ విజయవాడ దుర్గ గుడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అమ్మవారని దర్శించుకునే అవకాశం కల్పించింది.

vijayawada durga temple
vijayawada durga temple

By

Published : Jun 21, 2021, 9:43 PM IST

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే దసరాలోగా ప్రారంభించి.. ఆ తర్వాత దసరా నాటికి ప్రారంభింపజేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఛైర్మన్‌ పైలా సోమినాయుడు అధ్యక్షతన కనకదుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం జరిగింది. ఆలయ అధికారులు రూపొందించిన 43 అజెండా అంశాలపై చర్చించింది.

కీలకమైన మార్పు..

ఇటీవల అనిశా, విజిలెన్స్‌ విభాగాల దాడులు చేసి పలు లోపాలను గుర్తించిన దరిమిలా టెండర్ల ఖరారు విషయంలో ఆచితూచి పాలకమండలి ఆమోద ముద్ర వేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా టెండరులో తక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికి పనుల అప్పగించింది. పారిశుధ్య విభాగం.. పాలు, పెరుగు, వెన్న సరఫరా, శాశ్వత అన్నదానంలో కాయగూరల శుభ్రత, నిర్వహణ, ప్రసాదం తయారీ దిట్టం మార్పు వంటి పనులకు సంబంధించి తగిన ప్రమాణాలు లేని వాటిపై మళ్లీ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో పాటు కీలకమైన పనుల విషయంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి మేరకు పనుల అప్పగించాలని పాలకమండలి సూచించడం.. ఆలయ పరిధిలో వచ్చిన కీలకమైన మార్పుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ సమయాల్లోనే దర్శనాలకు అనుమతి..

కరోనా ఆంక్షల సడలింపు తరుణంలో భక్తులకు మెరుగైన రీతిలో దర్శనం కల్పించాలని భావించిన పాలకమండలి.. సోమవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు భక్తులు కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామిలను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించడంతో ఈ మేరకు మార్పులు చేశారు. దేవస్థానంలో అమ్మవారికి, మల్లేశ్వరస్వామికి నిత్య కైంకర్యాలు ఏకాంతంగానే జరపాలని నిర్ణయించారు. పది రకాల ఆర్జిత సేవలను పరోక్ష పద్ధతిలో జరిపించుకోవచ్చని పాలకమండలి భక్తులకు సూచించించింది. కరోనా సమయంలో ఆర్జిత సేవలు- ఈ-హండీ, ఈ-సేవల ద్వారా 34 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపింది.

ప్రణాళికకు తుదిరూపు..

గత దసరా సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన 70 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనుల ప్రణాళికకు తుది రూపు వచ్చిందని... హైదరాబాద్‌కు చెందిన క్రియోటా సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మారుతీ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ ఈ మాస్టర్‌ప్లాన్‌ తయారు చేశాయని పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కొవిడ్‌ కారణంగా ప్రణాళిక అమలులో జాప్యం జరిగిందని... దేవాదాయశాఖ కమిషనర్‌ ఆమోదానికి పంపించినట్లు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని- ప్రస్తుతం ఉన్న అద్దె మొత్తాలను కూడా తగ్గించామని... వసతి సదుపాయాల వివరాలతో ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

దేవస్థానం పరిధిలో భక్తులు...దాతలకు సరైన రీతిలో దర్శన అవకాశం కలిపించడంతోపాటు వారిని గౌరవించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలోని దేవస్థానానికి చెందిన కొన్ని భూములలో పంట సాగు చేసుకుని కౌలు హక్కును మూడేళ్ల కాలపరిమితికి 2021-22 నుంచి 2023-24 వరకు ఎక్కువ పాటదారులను ఆమోదింపజేసేందుకు పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని పాలక మండలి అధికారులను ఆదేశించింది. ఈ సమావేశంలో ఈవో డి.భ్రమరాంబ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, వైదిక కమిటీ ప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి:Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం

ABOUT THE AUTHOR

...view details