ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కృష్ణలంక, కార్మికనగర్ ప్రాంతాల్లోని ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఒకేచోట ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కృష్ణలంకలో ఓ ట్రక్కు డ్రైవరు తనకు సమయం గడవడం లేదని.. ఇంట్లో తన కుటుంబంతో ఉండకుండా చుట్టుపక్కల వారిని పిలిచి వారితో పేకాట ఆడాడు. వారి పిల్లలు, మహిళలు బయటకొచ్చి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లి హౌసీ తదితర ఆటలు ఆడడం ద్వారా సుమారు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టరు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కార్మికనగర్‌కు చెందిన మరో ట్రక్కు డ్రైవరు.. తన కుటుంబ సభ్యులతోపాటు ఇరుగు పొరుగు వారిని కలవడం ద్వారా సుమారు 15 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్నందునే లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ఉందని విజ్ఞప్తి చేశారు.