తెలంగాణ

telangana

ETV Bharat / city

Vijayadashami 2021: నవరాత్రుల వేళ అమ్మవారు ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా..? - vijayadashami 2021 latest news

గుళ్లో విగ్రహానికి, ఇంట్లో పటానికి పూజలు చేస్తాం, నివేదనలు సమర్పిస్తాం. అంతే తప్ప అమ్మవారి అసలు రూపురేఖలేంటో, ఆ చల్లనితల్లి జాడేమిటో మనకు తెలీదు. భక్తిగా అర్చిస్తూ, కష్టాన్నీ సుఖాన్నీ చెప్పుకునే మన ఆరాధ్యదైవం అమ్మ చిరునామా ఎక్కడో, ఆ తల్లి తత్వమేంటో తెలుసుకుందాం...

vijayadashami 2021 special story about goddess address
vijayadashami 2021 special story about goddess address

By

Published : Oct 15, 2021, 6:02 AM IST

మేరుపర్వతం మధ్యశిఖరంపై గల శ్రీమన్నగరానికి నాయకురాలిగా చింతామణి గృహంలో, పంచ బ్రహ్మాసనంపై అమ్మ ఆసీనురాలై ఉంటుందని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రంలో సుమేరు శృంగ మధ్యస్థా, శ్రీమన్నగర నాయికా, చింతామణి గృహాంతస్థా, పంచ బ్రహ్మాసన స్థితా, మహా పద్మాటవీ సంస్థా, కదంబ వన వాసినీ, సుధా సాగర మధ్యస్థా- నామాలలో ఈ ప్రదేశాలన్నీ దేవీ నివాస స్థానాలుగా వర్ణించారు వ్యాసులవారు.

లలితాదేవి శరన్నవరాత్రుల వేళ మణిద్వీపంలో కొలువై ఉంటుంది. ఆ ద్వీపం ఎక్కడంటారా?! మనం ఉంటున్న ఈ భూమినుంచి వరుసగా ఏడు ఊర్ధ్వ లోకాలున్నాయి. వాటిలో సత్యలోకం అన్నిటికంటే పైనుంది. ఆ పైన వైకుంఠ కైలాసాలు, అంతకంటే పైన గోలోకం, ఆపైన మణిద్వీపం. ఇది అమృత సముద్రం మధ్యలో ఉంది. ఈ ద్వీపంలో ఉన్న చింతామణి గృహం అమ్మకు నివాస స్థానం. గొప్ప గొప్ప పద్మాలున్న అడవిలో, కడిమిచెట్ల తోటలో చింతామణులతో కట్టిన ఇల్లది. ఆ ఇంట్లో ఐదు శక్తులతో ఏర్పాటైన ఒక ఆసనంపై లలితాదేవి దర్శనమిస్తుందట. అమ్మని దర్శించుకోవాలంటే, ఈ ప్రదేశాలన్నీ దాటి వెళ్లాలి.

ఇంటిపక్కనున్న గుడికి వెళ్లడానికే అలసిపోయే మనం అంతదూరం ప్రయాణించడం కొంచెం కష్టమైన వ్యవహారమే. అయితే లలితా సహస్రనామ స్తోత్రంలోని ‘అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా’ నామాలు దారి చూపిస్తాయి. మనం అనుసరించే మార్గం బహిర్ముఖమైతే, అమ్మను చేరుకోవటం దుర్లభం. కానీ సాధకులు అంతర్ముఖులైతే మాత్రం తనలోనే అమ్మను దర్శించి, సేవించగలుగుతారు. చిత్తశుద్ధితో సాధనచేస్తే మనసులో లేనిపోని ఆలోచనలేవీ రావు. అప్పుడు ఆ మనసే అమృత సముద్రమై, అమ్మకు నివాసం అవుతుంది.

మేరుపర్వత మధ్యశిఖరాన అమ్మ ఉందనుకున్నాం కదా! ‘మేరు’ పదంలో- ‘మ- అ- ఈ- ర- ఉ’ అక్షరాలున్నాయి. వీటిలో మధ్యనున్న ‘ఈ’ అక్షరం అమ్మ నివాసం. ‘ఈం’ అనే ఈ అక్షరమే ఐం, శ్రీం, హ్రీం, క్రీం, క్లీం మొదలైన బీజాక్షరాలకు మూలం. దేవీ మంత్రం దీక్షగా జపిస్తే, అమ్మదర్శనం కోసం పరితపిస్తే.. అప్పుడు హృదయాలు బంగారు కొండలవుతాయి. కల్మషంలేని పవిత్ర హృదయమే మేరు పర్వతం. అది అమ్మకు నివాసం.

ఆ మణిద్వీపంలోని శ్రీమన్నగరానికి నాయకురాలు లలితాదేవి. ‘శ్రీ’ అంటే శోభ, సంపద, శ్రేయస్సు, ఆనందం. మన శరీరంలోని ఐదు కర్మేంద్రియాలూ, ఐదు జ్ఞానేంద్రియాలకూ అధిదేవతలున్నారు. కనుకనే ‘దేహమే దేవాలయం’ అన్నారు పెద్దలు. నిత్యమూ ధార్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన సాగినప్పుడు అందాకా నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ మేలుకుంటాయి. అప్పుడు శరీరమనే శ్రీమన్నగరంలోనే భక్తులకు అమ్మ దర్శనమిస్తుంది.

మణిద్వీపంలో పద్మాలు విరబూసిన అడవి, కదంబ వనము ఉన్నాయి. లోకంలోని పద్మాలన్నీ సూర్యోదయంతో వికసించి, సూర్యాస్తమయంతో ముడుచుకుంటాయి. కానీ అవి మాత్రం ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ విశిష్ట పద్మాల్లోనే నివాసం ఏర్పరచుకుంది అమ్మ. మన దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న పద్మాలు యోగ సాధనవల్ల వికాసం పొందుతాయి. ఆనందమనే మకరందంతో ఉప్పొంగుతాయి. ఆ వికసిత మనసుల్లో లలితాదేవి కొలువుతీరి ఉంటుంది.

కడిమిచెట్టుకు ‘నీపము’ అని ఇంకో పేరుంది. అంటే అది జీవుడికి దేవుడితో తాదాత్మ్యం కలిగిస్తుందన్నమాట. కడిమిచెట్టు మేఘాలను ఆకర్షించి, వర్షాలను కురిపిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. నింగినుంచి నేలకు దిగివచ్చే దైవానుగ్రహానికి సంకేతం వర్షం. సన్మార్గంలో జీవించే వారికి దైవానుగ్రహం సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని కదంబవనం సూచిస్తోంది. ఈ సత్యాన్ని గుర్తించి, ప్రవర్తించేవారి మానస కదంబవనం అమ్మ నివాసం.

కల్పవృక్షం, కామధేనువుల్లానే కోరినవన్నీ ప్రసాదించేది చింతామణి. అలాంటి చింతామణులతో కట్టిన ఇల్లు అమ్మది. భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే అమ్మవారి గుణమే ఆ తల్లి నివసించే ఇంటికి కూడా అబ్బింది. ఆ గుణాన్ని అలవరచుకుంటే, చింతామణీ మంత్రజప సాధన ఫలిస్తుంది. భక్తుల దివ్య దేహమే చింతామణి గృహమై అంతర్ముఖంగా అమ్మదర్శనం లభిస్తుంది. ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది లలితాదేవి. బ్రహ్మ అంటే శక్తి. ఐదు శక్తులతో ఏర్పాటైన ఆసనం అది. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, (కనిపించకుండా ఉండటం) అనుగ్రహం- అనే ఐదు పనులను ఐదుపేర్లతో నిర్వహిస్తోంది అమ్మ. అందుకు సంకేతం పంచబ్రహ్మాసనం. సాధనవల్ల ఈ సత్యాన్ని గుర్తించిన భక్తుణ్ణి కామక్రోధాలు మొదలైన అరిషడ్వర్గాలు ఏమీ చేయలేవు.

మనకు అందకుండా ఎక్కడో దూరంగా ఉన్నదనిపించే అమ్మ నివాసం ఇక్కడే మనకు అందుబాటులోనే ఉంది. సాధన వల్ల అది అనుభవానికి వస్తుంది. నిర్మలమైన మనసే అమ్మవారి అసలైన చిరునామా.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details