వైద్యవిద్య ప్రవేశాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం.. మొత్తం వైద్యవిద్య ప్రవేశ ప్రక్రియలో అతి కీలకమైన ఐచ్ఛికాల ఎంపిక ఉంటుంది. అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఇక్కడే అని కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఏటా మంచి ర్యాంకులను సొంతం చేసుకునే పలువురు విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపికపై అవగాహన లేక తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హతను కోల్పోతున్నారు. వచ్చే వారంలో ప్రారంభం కానున్న ఐచ్ఛికాల ఎంపికపై సమగ్ర అవగాహన ద్వారా అర్హతకు తగ్గట్లుగా వైద్యకళాశాలలో సీటు పొందడానికి అవకాశాలు మెరుగవుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి తెలిపారు.
ఎందుకింత ప్రాధాన్యం?
వైద్యవిద్య సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడానికి విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఒక ప్రవేశ నిర్వహణ కమిటీని నియమిస్తుంది. దాని పర్యవేక్షణలో, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి, కోర్టు తీర్పులను పరిగణిస్తూ ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునే క్రమంలో.. సాధారణంగా విద్యార్థులు ప్రాధాన్యపరంగా కళాశాలలను ఎంచుకుంటారు. వాటి జాబితా నుంచే విద్యార్థి ర్యాంకు ఆధారంగా కళాశాలను ప్రవేశ కమిటీ కేటాయిస్తుంది. ఇక్కడే కొందరు విద్యార్థులు తప్పులో కాలేస్తున్నారు.
ప్రాధాన్య క్రమంలో తాము చేరడానికి ఇష్టపడని కళాశాలలను సైతం జాబితాలో చేర్చుతున్నారు. వాటిలో సీటొస్తే చేరకుండా తదుపరి కౌన్సెలింగ్‌లో ప్రయత్నించాలనే భావనతో ఉంటున్నారు. నిబంధనల ప్రకారం.. ఐచ్ఛికాల్లో ఎంపిక చేసిన కళాశాలల్లో కనుక సీటొస్తే.. ఆ విద్యార్థి కచ్చితంగా ఆ విడత కౌన్సెలింగ్‌లో చేరాల్సిందే. చేరకపోయినా, కళాశాలలో చేరి సీటును వదిలేసినా.. తర్వాతి విడతకు ఆ విద్యార్థులు తమంతట తామే ప్రవేశ అర్హత కోల్పోతారు. ఒకవేళ సీటు వచ్చిన కళాశాలలో చేరితే.. మరుసటి విడత కౌన్సెలింగ్‌లో మళ్లీ ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునేటప్పుడే.. కచ్చితంగా చేరుతామని నిర్ణయించుకున్న కళాశాలలనే ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలని కాళోజీ వర్సిటీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఈడబ్ల్యూఎస్‌లో సగం సీట్లే
ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద రాష్ట్రంలోని గాంధీ, కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వైద్యకళాశాలల్లో 190 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేశారు. ఈ కోటాలో చేరాలనుకునే విద్యార్థుల్లో కొందరు.. సీట్లన్నీ తమకు కేటాయించడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై కాళోజీ వర్సిటీ స్పష్టతనిచ్చింది. నిజానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో రాష్ట్రానికి 95 సీట్లే మంజూరు కాగా.. కోటాను వర్తింపజేయడం వల్ల ఇతర రిజర్వేషన్ శాతాల్లో వ్యత్యాసం ఏర్పడే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాటిలో సమతౌల్యతను పాటించడంలో భాగంగా అదనంగా మరో 95 సీట్లను మంజూరుచేసింది. అంటే మొత్తం 190 సీట్లలో సగం ఈడబ్ల్యూఎస్ కోటాలో, మిగిలినవి ఇతర రిజర్వేషన్ల పరిధిలో భర్తీ చేస్తారని కాళోజీ వర్గాలు తెలిపాయి.