ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాలు ప్రాంతీయ భాషల్లోనే భోదన జరగాలని ఆకాంక్షించారు. ఐఐటీ తిరుపతి 6వ ఇన్‌స్టిట్యూట్ డేలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. పద్మభూషణ్ గ్రహీత అనుమోలు రామకృష్ణ జీవిత చరిత్ర తెలుగు అనువాదం, వారసత్వ నిర్మాత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలని వెంకయ్య నాయుడు అన్నారు.
'ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో జరగాలి. కోర్టుల్లో జరిగే వాదప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టుల తీర్పులు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలపై యువత ఆలోచించాలి. నిరంతరం పరిశోధనలపై దృష్టి పెట్టాలి'-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు