మాతృ భాషను విస్మరిస్తే సంస్కృతి, సాహిత్యం, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (Telugu Samakhya) 6వ వార్షికోత్సవంలో వర్చువల్గా మాట్లాడిన ఆయన.. మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
అలా ఎదిగిన వారే..
ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్దపీట వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు వెయ్యికి పైగా సంస్థలు.. భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటుపడుతున్నాయని చెప్పారు.