హక్కులను పొందడం కంటే ముందు, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అత్యంత ఆవశ్యకమని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం ఈ విషయాన్నే తెలియజేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(vice president venkaiah naidu latest speech) పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం నుంచి, శ్రీరాముని జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం (పద్యకావ్యం) పుస్తకాన్ని(ramayana written by shashikiran) ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్ధమయ్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్కు ఆయన అభినందనలు తెలియజేశారు.
రామాయణం అంటే రాముడి కథ మాత్రమే కాదని, మనిషిగా పుట్టి, మనిషిగా జీవించి, మనిషి ఎలా బతకాలో దిశానిర్దేశం చేసిన మహనీయుని జీవితమన్న ఉపరాష్ట్రపతి.. మనిషి జీవితంలోని వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో, వివిధ అనుబంధాలకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో ఆయన గాథ తెలియజేస్తుందన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృవాక్పరిపాలకుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సోదరులకు, నమ్మిన వారికి ఆప్యాయతను పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ, ప్రతి అడుగులోనూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన పురుషోత్తముడని తెలిపారు.