న్యాయస్థానాల్లో కేసుల విచారణలో జాప్యాన్ని గణనీయంగా తగ్గించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ‘దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం’లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సివిల్ కేసుల్లో ఒక్కోసారి తీర్పు ఖరారయ్యేసరికి 25 ఏళ్లు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరిగితే ప్రజల్లో వ్యవస్థలపై విశ్వాసం సడలుతుందన్నారు. న్యాయవాదులు ఎన్ని కేసుల్లో తక్కువ వాయిదాలు తీసుకున్నారన్న విషయాలను పరిశీలించుకోవాలన్నారు. అటార్నీ జనరళ్లు, అడ్వకేట్ జనరళ్లు, ప్రభుత్వ న్యాయవాదులు రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. చాలా కేసులు పదేపదే వాయిదా పడుతున్నాయని.. రెండుకు మించి వాయిదాలు లేకుండా తీర్పునిచ్చేలా ఉండాలని సూచించారు.
ప్రజలందరికీ న్యాయం అందుబాటులోకి రావాలని, అప్పుడే సామాన్యుడు అన్యాయాలపై ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించగలడని తెలిపారు. న్యాయవ్యవస్థలో సానుకూల మార్పులకు కారకులుగా న్యాయవిద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే ఆలోచన చేయాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎంతోమంది పాటుపడ్డారని, వారి జీవితగాథలను విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే దేశంలో సగం మందికి టీకాలు అందలేదని.. నాయకులు, మీడియా వారిని చైతన్యవంతులను చేయాలని అన్నారు. ‘వాళ్లు ప్రధాని మోదీ కోసమో, సీఎం జగన్ కోసమో టీకాలు తీసుకుంటారా.. వాళ్లకోసమే కదా?’ అని చెప్పారు.