తెలంగాణ

telangana

ETV Bharat / city

Venkaiah Naidu : అందరివాడు.. అనితరసాధ్యుడు..!

Venkaiah Naidu Profile: సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రాజకీయ వారసత్వం లేదు. ఎటువైపు నుంచీ ఆ నేపథ్య బలమూ లేదు. కానీ.. నిబద్ధత, క్రమశిక్షణే ఆలంబనగా.. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే మార్గదర్శకాలుగా.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు వెంకయ్యనాయుడు. ఒకనాడు అడ్వాణీ, వాజ్​పేయీ వాల్‌పోస్టర్లు అతికించిన సందర్భం నుంచి.. ఆ పార్టీ మొత్తం ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్తకంఠంతో తీర్మానించే వరకు తనదైన ముద్ర వేశారు. ఏపీలోని విశాఖలో విద్యార్థి నేత నుంచి దిల్లీలో ఉపరాష్ట్రపతి వరకు.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా... వెకడుగువేయక దీక్షాదక్షతలతో ముందుకు సాగారు. అనుకుంటే.. సామాన్యులూ అసమాన విజయగాథలు లిఖించుకోవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు వెంకయ్యనాయుడు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత ప్రస్థానంలో ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం.

Venkaiah Naidu : అందరివాడు.. అనితరసాధ్యుడు..!
Venkaiah Naidu : అందరివాడు.. అనితరసాధ్యుడు..!

By

Published : Aug 9, 2022, 2:08 PM IST

Venkaiah Naidu : అందరివాడు.. అనితరసాధ్యుడు..!

Venkaiah Naidu Profile: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జులై 1న జన్మించారు వెంకయ్యనాయుడు. బాల్యంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి వైరాగ్యంతో ఎక్కడికో వెళ్లిపోయినా.. అమ్మమ్మ ఒడిలోనే ఒద్దికగా పెరుగుతూ భవిష్యత్ లక్ష్యాలకు బాటలు వేసుకున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత నెల్లూరులోని వి.ఆర్. కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో బీఏ.. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్​ పూర్తి చేశారు వెంకయ్య. విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచే ఆర్​ఎస్​ఎస్​ స్వయంసేవక్‌గా పని చేయడం వల్ల క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం అలవడింది.

వెంకయ్య నాయకత్వ ప్రతిభ విద్యార్థి దశలోనే బహిర్గతమైంది. వి.ఆర్. కాలేజీతో పాటు ఏయూ పరిధిలోని అన్ని కళాశాలలకూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన అనర్గళ వాక్చాతుర్యంతో ఆయన జనం దృష్టిని ఆకర్షించేవారు. ఆ క్రమంలోనే ఆంధ్ర లా కాలేజీ తరఫున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో వెంకయ్యనాయుడిపై జాతీయ నేతల దృష్టి పడింది. ఈ సందర్భాన్ని ఆయన జీవితంలో కీలక మలుపుగా పేర్కొనవచ్చు. తర్వాత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మైలు రాయిగా చెప్పే జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో మరింత రాటుదేలారు. ఎమర్జెన్సీ రోజుల్లో 17 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు.

ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు తిరుగులేని నేత..: 28 ఏళ్ల వయసులోనే వెంకయ్యనాయుడుకు శాసనసభకు పోటీ చేసేందుకు ఆహ్వానం లభించింది. 1978లో ఆయన జనతా పార్టీ టిక్కెట్​పై ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నెల్లూరు జిల్లాలో మిగతా 10 నియోజకవర్గాల నుంచి ఎన్నికైంది కాంగ్రెస్ అభ్యర్థులే. దేశమంతా ఇందిరా ప్రభంజనం వీస్తున్నా.. ఉదయగిరిలో వెంకయ్యదే విజయబావుటా. స్వయంగా ఇందిరాగాంధీ ఉదయగిరికి ప్రచారానికి వచ్చినా.. వెంకయ్యను ఓడించలేకపోయారు. ఆయన తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1980 నుంచి 85 వరకూ భాజపా అఖిల భారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1983లో వెంకయ్య భాజపా టికెట్​పై గెలిచినప్పుడు జిల్లాలో మిగతా 10 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు తిరుగులేని నేతగా మారారు.

జాతీయస్థాయిలో పేరు మార్మోగిన వేళ..: ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎన్టీఆర్​ను 1984లో అప్రజాస్వామిక మార్గంలో పదవీచ్యుతుడిని చేసేందుకు ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాలను వెంకయ్యనాయుడు ఇతర విపక్ష నాయకులతో కలిసి వమ్ము చేశారు. 1985 నుంచి 1988 వరకు ఏపీ భాజపా ప్రధాన కార్యదర్శిగా.. 1988 నుంచి 1993 వరకు ఏపీ భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా ప్రసంగించడం చూసి వాజ్​పేయీ, అడ్వాణీలు ఆయనను జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. అలా 1993లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996 నుంచి 2000 వరకూ భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా.. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా, అధ్యక్షుడిగా పని చేశారు. అప్పుడే ఆయన పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది.

వరించిన మంత్రి పదవి..: 1999 సార్వత్రిక ఎన్నికల్లో వాజ్​పేయి సారథ్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వెంకయ్య నాయుడు 2000 సెప్టెంబర్‌ నుంచి 2002 జూన్‌ వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. మొదట.. ఆయన సమకాలీనులంతా ప్రభుత్వంలో చేరితే, వెంకయ్య మాత్రం కేంద్ర కార్యాలయం ద్వారా పార్టీ కోసం పని చేసేందుకు ముందుకు రావడం అగ్రనాయకత్వం అందర్నీ ఆకర్షించింది. అయినా.. వెంకయ్య పనితీరు దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. శాఖ ఎంపిక అవకాశాన్నీ ఆయనకే ఇచ్చింది. అత్యంత కీలకమైన ఆర్థిక ప్రాధాన్యత ఉన్న శాఖలు కోరుకుంటారనుకుంటే వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ది శాఖను కోరి వాజ్​పేయిని సైతం ఆశ్చర్యపరిచారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కీలక పథకాన్ని ప్రారంభించి దేశంలోని వేలాదిగ్రామాలకు రహదారులు నిర్మించేలా చూశారు.

వారిద్దరి తర్వాత అత్యంత ప్రాధాన్యత గల నేతగా..: పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో వాజ్​పేయి, అద్వానీ.. వెంకయ్యనాయుడుకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అప్పగించారు. 2002 జులైలో భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై.. 2004 చివరి వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో పార్టీ బలోపేతం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. "ఒక చేతిలో ఎన్డీఏ ఎజెండా, మరో చేతిలో భాజపా జెండా" అన్న నినాదం వెంకయ్య సృష్టించిందే. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే మంత్రుల్ని సైతం ఆయన పార్టీ కార్యాలయానికి రప్పించి పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు వీలు కల్పించారు. ప్రధానమంత్రి కార్యాలయం - పార్టీకి మధ్య సంధానకర్తగా పని చేశారు. ఒకప్పుడు వాజ్​పేయి, అద్వానీల పోస్టర్లు అంటించి, వారి సభల కోసం ప్రచారం చేసిన కార్యకర్త స్థాయి నుంచి.. జాతీయ స్థాయిలో వారి మధ్య కూర్చుని వారిద్దరి తర్వాత అత్యంత ప్రాధాన్యత గల నేత తానేనని నిరూపించారు.

2004, 2010లోనూ వెంకయ్య వరుసగా రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2014లో మోదీ సారథ్యంలో భాజపా అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖలతో పాటు కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్వహించారు. తర్వాత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పార్లమెంట్ సాఫీగా సాగేలా చూడడంలోనూ, కీలక చట్టాల విషయంలో ఏకాభిప్రాయ సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యసభలో పార్టీ మైనారిటీలో ఉన్న సమయంలో కీలక చట్టాలను ఆమోదింపచేసేందుకు ఆయన ప్రతిపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారి మద్దతు సంపాదించేవారు. భూసేకరణ బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లు వంటి ముఖ్యమైన చట్టాలను ఆమోదించగలిగారు. జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల్లో అందెవేసిన చేయి..: ఇంత నేపథ్యం ఉండబట్టే.. 2017లో దేశమంతా ఉపరాష్ట్రపతిగా ఎవర్ని నియమిస్తారని అనుకుంటున్న సమయంలో ఆ పదవి నిర్వహించేందుకు వెంకయ్య కంటే సమర్థుడు మరొకరు లేరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పార్టీ నేతలంతా భావించారు. వెంకయ్యకున్న అపారమైన రాజకీయ అనుభవం, పార్లమెంటరీ వ్యవహారాల్లో అందెవేసిన చేయి కావడంతో రాజ్యసభ ఛైర్మన్​గా ఆయనకంటే మించిన వారు దొరకరని భాజపా నాయకత్వం భావించింది. ఫలితంగా ఆయన రాజ్యాంగపరంగా రెండో అత్యున్నత పదవి స్వీకరించి, ఆ పదవికి వన్నె తీసుకొచ్చేందుకు అహర్నిశలూ కృషి చేశారు.

ఇవీ చదవండి:

పదవులకే వన్నె తెచ్చిన అవిశ్రాంత యోధుడు.. వెంకయ్య నాయుడు..

venkaiah naidu: పెద్దల సభకే 'సమయం' నేర్పిన నేత.. వెంకయ్యనాయుడు

'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'

ABOUT THE AUTHOR

...view details