Venkaiah Naidu at Global Health Summit: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విదేశాల నుంచి భారత్‌లోని అనేక నగరాలకు వైద్యం కోసం రోగులు వస్తుండగా.. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మాత్రం సరైన వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. టెలీ మెడిసిన్ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్న వెంకయ్య.. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సేవలు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏపీఐ ప్రెసిడెంట్ అనుపమ గొట్టిముక్కల, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ రవి కొల్లి, ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నట్టు ఉపరాష్ట్రపతి తెలిపారు. రాష్ట్రం హెల్త్ కేర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో నిలవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏటికేడు తెలంగాణలో వైద్య సదుపాయాలు మెరుగవుతున్నాయన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందించారు.