తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంది: వెంకయ్య - telangana news

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. రైతుల నేపథ్యం, కుటుంబ స్థితిగతులు సహా సేంద్రియ సాగు వైపు ఎలా మళ్లారో అనుభవాలు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు అనేక అంశాలపై మచ్చటించారు.

venkaiah naidu
venkaiah naidu

By

Published : Dec 23, 2020, 5:37 PM IST

వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయం అనేది వృత్తి కాదని... గొప్ప జీవన సంస్కృతి అని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నదాతలు సేద్యం నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రతి రైతు పాడి, మత్స్య, కోళ్ల, ఇతర ఆహారోత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఆదాయాలు పెంచుకోవడం ద్వారా వ్యవసాయంలో వచ్చే ఒడుదొడుకులను అధిగమించవచ్చని చెప్పారు. దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వెంకయ్యనాయుడు... రైతులతో భేటీ అయ్యారు.

మూడు గంటలపాటు

రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ప్రముఖ సేంద్రియ రైతులు సుఖవాసీ హరిబాబు, నాగరత్నంనాయుడు, నాగర్‌కర్నూలు జిల్లా రైతు లావణ్యరమణారెడ్డి, ఖమ్మం జిల్లా యువ రైతు హరికృష్ణసహా మొత్తం ఆరుగురుతో ఆత్మీయంగా మాట్లాడారు. రైతుల నేపథ్యం, కుటుంబ స్థితిగతులు సహా రసాయన మందుల నుంచి ప్రకృతి, సేంద్రియ సాగు వైపు ఎలా మళ్లారో అనుభవాలు తెలుసుకుని వెంకయ్య సంతోషం వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు అనేక అంశాలపై ముచ్చటించారు.

రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాటమంతి

జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వెంకయ్య

నెల్లూరు జిల్లాలో తన బాల్యం, గ్రామం, పెరిగిన వాతావరణం, పాడి - పంట, పండుగలు, అటుకులు, అరిసెలు సంస్కృతి, సంప్రదాయాలు, గంగిరెద్దులు వంటి అనుభూతులను వెంకయ్య పంచుకున్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు వ్యవసాయం, పశుసంపదతో అనుబంధం పెనవేసుకుపోయిందని గత స్మృతులు తలుచుకున్నారు. గ్రామీణ జీవనం గొప్పతనాన్ని నెమరువేసుకున్నారు. కష్టాల్లోనూ లాభసాటిగా మార్చుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం విజయాలు పట్ల అభినందనలు తెలియజేశారు.

అలా చేస్తే ఆరోగ్య భారతం

రైతులు పెట్టుబడులు తగ్గించుకుంటూ సేంద్రియ సాగు ద్వారా నాణ్యమైన పంటను ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తే ఆరోగ్య భారతం నిర్మితమవుతుందని వెంకయ్య సూచించారు. వ్యవసాయం వదిలేయకుండా ప్రకృతి సేద్యం విధానాలపై ప్రచారం కల్పించి... మార్కెటింగ్‌ ఏర్పాటు చేసుకుని లాభాలు గడించాలని ఉపరాష్ట్రపతి తమకు దిశానిర్దేశం చేశారని ఈటీవీ భారత్​ వద్ద సేంద్రియ రైతు సుఖవాసీ హరిబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :కరెంట్ కట్​ చేయబోతే​.. కొడవలితో బెదిరింపు

ABOUT THE AUTHOR

...view details