ఓ విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడానికి ఉపరాష్ట్రపతి 9 నిమిషాల పాటు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ విషయం తెలిసి శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి శివ అక్కడకు వచ్చాడు. ఎవరి చిత్రమైనా తలకిందులుగా ప్రారంభించి 10 నిమిషాల్లో వేయడంలో శివ దిట్ట.
Venkaiah Naidu: విద్యార్థి కోసం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ఉపరాష్ట్రపతి - Vice President venkayya naidu
విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి రెడీ అవుతున్నారు. ఆయన రాక కోసం శంషాబాద్లో భద్రతా సిబ్బంది వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి.. ఆయన్ని కలవాలని.. బహుమతి ఇవ్వాలని సిబ్బందిని కాళ్లావేళ్లా పడుతున్నాడు. చివరికి అనుమతి సాధించాడు. నేరుగా ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తన విజ్ఞప్తి చేశాడు. సమయం కావస్తోన్నా.. విద్యార్థిని ప్రోత్సహించటం కోసం.. ఏకంగా తన ప్రయాణాన్నే కాస్త వాయిదా వేసుకున్నారు.
ఉప రాష్ట్రపతి చిత్రాన్ని ఆ విధంగా వేస్తానని.. ఆయనకు బహుమతిగా ఇవ్వాలని వేచి చూస్తున్నానని భద్రతాసిబ్బందిని వేడుకున్నాడు. దీంతో వారు అనుమతించారు. అప్పటికే విమానాశ్రయానికి బయలుదేరడానికి సమాయత్తమవుతున్న ఉపరాష్ట్రపతి వద్దకు శివ వెళ్లి సర్.. మీ చిత్రం వేస్తానని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే ఆలస్యమైంది. నా రాక కోసం శంషాబాద్, దిల్లీ విమానాశ్రయాల్లో ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. అంటూనే... "సరే 10 నిమిషాలు ఆగుతా... వేయి చూద్దాం" అన్నారు. శివ.. కేవలం 9 నిమిషాల్లోనే చిత్రాన్ని వేసి బహూకరించడంతో వెంకయ్యనాయుడు ఆశ్చర్యపోయారు.