తూర్పు నౌకా దళం యుద్ధ సన్నద్ధతపై.. దళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ నాలుగు రోజుల పాటు సమీక్షించారు. విన్యాసాలు, యుద్ధం కోసం ప్రతి విభాగం సిద్ధమై ఉన్న తీరును ఆయన పరిశీలించారు. 22 యుద్ధ నౌకలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మెరుపు దాడులను తిప్పికొట్టడం, ఆయుధాలతో ఎదురు దాడి, శతఘ్నులతో బహుముఖ దాడి చేయగల సామర్థ్యాన్ని పరీక్షించారు. యాంటీ సబ్ మెరైన్ విన్యాసాలు, టార్పెడో ఫైరింగ్, దళం బహుముఖ వ్యూహాలను వాస్తవ పరిస్థితుల్లో పరిశీలించారు.
సముద్రంపై యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తిస్తున్న నావికులను వైస్ అడ్మిరల్ కలిసి.. యుద్ధ సన్నద్ధత, దాడులను తిప్పికొట్టే అంశాలపై పలు సూచనలు చేశారు. బహుముఖ వ్యూహంలో భాగంగా.. నౌకా అవసరాలు, తీర ప్రాంత రక్షణ, ప్రాదేశిక జలాల్లో దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం తూర్పు నౌకా దళం నిత్యం సన్నద్ధంగా ఉండాలన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొంటూనే, యుద్ధ సన్నద్ధతను సమీక్షించుకోవడం వల్ల.. హిందూ మహా సముద్రంలో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడగలుగుతున్నామన్నారు.