తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారట...! - మదర్స్​డే స్పెషల్​ స్టోరీ

మాతృత్వం.. అదో వరం. ఒక స్త్రీ అమ్మగా మారిన తర్వాతే ఆమె జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని భావిస్తారు. అయితే అమ్మగా మారడం అనేది ఎంత గొప్ప వరమో.. అంతకంటే పెద్ద బాధ్యత కూడా. అయితే అన్ని అంశాలూ అనుకూలంగా ఉంటే ఈ బాధ్యతలను మరింత సమర్థంగా, ఆనందకరంగా నిర్వర్తించచ్చు కదూ. ఈ క్రమంలో గర్భిణులు, తల్లులు, పిల్లల గురించి శ్రద్ధ వహిస్తూ.. వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేలా చేసేందుకు అనేక దేశాలు ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాంటి కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం...

very importance giving to mothers in some countries
very importance giving to mothers in some countries

By

Published : May 9, 2021, 6:00 PM IST

నార్వే...

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. ఇక్కడ శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది. ఇక మాతృ మరణాల రేటైతే 15,000కి 1గా నమోదవుతోంది. అన్ని ఆరోగ్య సూచికల్లోనూ నార్వే మంచి స్థానాన్ని సాధించింది. అలాగే ఇక్కడ తల్లి కాబోయే మహిళలకు 36 నుంచి 46 వారాల పాటు పేరెంటల్ లీవ్‌ని మంజూరు చేస్తారు. వంద శాతం జీతంతో ఈ సెలవులను తీసుకోవచ్చు. అంతేకాదు.. నార్వేలో పిల్లలందరూ మంచి విద్య, ఆరోగ్యం పొందగలుగుతారు. ఎందుకంటే పిల్లలందరికీ వీటిని అక్కడి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారటా...!

ఫిన్లాండ్...

ఫిన్లాండ్ పార్లమెంట్‌లో నలభై మూడు శాతం మంది మహిళలే. అందుకేనేమో ఆ దేశంలో మహిళలకు ఎంతో స్వేచ్ఛను కల్పిస్తారు. ఆ దేశంలో పుట్టే ప్రతి పాపాయి తల్లికి ప్రభుత్వం మెటర్నిటీ కేర్ కిట్‌ని అందజేస్తుంది. ఇందులో బేబీకేర్ ఉత్పత్తులు, చిన్నారుల దుస్తులు, తల్లికి ఉపయోగపడే వస్తువులు ఉంటాయి. వీటన్నింటినీ తీస్తే మిగిలే బాక్స్‌ని చిన్నారులకు బెడ్‌లా ఉపయోగించవచ్చు. దీనివల్ల అక్కడి పిల్లలకు చక్కటి ఆరోగ్యం అందుతోందట. అందుకే ఫిన్లాండ్ మాతృత్వానికి అనువైన దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా మాతృ, శిశు మరణాల రేటు తక్కువగానే ఉంది. ఇకపోతే ఇక్కడ ఉద్యోగం చేసే తల్లులకు 105 రోజుల పేరెంటల్ లీవ్‌ని అందిస్తారు. ఈ కాలంలో జీతంలో 70 శాతం మొత్తాన్ని వారికి అందజేస్తారు.

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారటా...!

ఐస్‌ల్యాండ్

ఐస్‌ల్యాండ్‌లో ప్రభుత్వం కుటుంబ వ్యవస్థ గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుంది. అక్కడి తల్లులు తమ పిల్లల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరమేమీ ఉండదు. ఎందుకంటే అక్కడి కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది కాబట్టి పిల్లలను పెద్దవారు దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు.. ప్రీస్కూల్స్‌కి చాలా తక్కువ ఖర్చుతో పంపే అవకాశం ఉండడంతో పిల్లల గురించి తల్లులు హైరానా పడరు. రోడ్డుపై పిల్లలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడిచే అవకాశం ఉండడంతో ఇక్కడి స్కూల్ పిల్లలు ఇంటికి తమంతట తామే నడుచుకుంటూ వెళ్లిపోతారట. ఇక ఇక్కడి పేరెంటల్ లీవ్ విషయానికొస్తే.. భార్యకు మూడు నెలలు, భర్తకు మూడు నెలలతో పాటు ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకోవడానికి వీలుగా మరో మూడు నెలల సెలవులను అందిస్తారు. మొత్తంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులిద్దరికీ కలిపి తొమ్మిది నెలల సెలవులు లభిస్తాయి.

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారటా...!

డెన్మార్క్

డెన్మార్క్‌లో పిల్లలున్న ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ అలవెన్స్ అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తల్లికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. పిల్లల అవసరాలన్నీ తీర్చేందుకు గాను తల్లికి దీన్ని ప్రతి మూడు నెలలకోసారి అందిస్తుంది. వీటితో పాటు చైల్డ్ కేర్ అలవెన్స్, స్పెషల్ చైల్డ్ అలవెన్స్, సబ్సిడీలు ఇలా ఎన్నో అందిస్తుంది ఇక్కడి ప్రభుత్వం. ఇవన్నీ పిల్లల వయసును బట్టి కొనసాగుతాయి. గరిష్ఠంగా వారికి ఇరవయ్యేళ్లు వచ్చే వరకు ఈ అలవెన్సులను అందిస్తారు. ఇక్కడ పేరెంటల్ లీవ్ కూడా 52 వారాలుండడంతో పిల్లల సంరక్షణ కోసం తల్లులు ఎక్కువ సెలవులు తీసుకోవచ్చు.

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారటా...!

స్వీడన్

గర్భం ధరించిన వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందించే దేశం బహుశా స్వీడన్ ఒక్కటేనేమో.. ఇక్కడ గర్భిణులకు ఇచ్చే సాధారణ బెనిఫిట్స్ కాకుండా కష్టతరమైన పని చేసేవారికి మరిన్ని సదుపాయాలను కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మహిళలు 480 రోజుల పేరెంటల్ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు విద్య, ఆరోగ్యం రెండూ ఉచితం. అంతేకాదు.. ప్రభుత్వం పిల్లల కోసం నెలవారీ అలవెన్సులను కూడా అందిస్తుంది. చంటి పిల్లలతో ఉన్నవారు ఇక్కడ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. పిల్లలు అనారోగ్యం పాలైతే వారిని జాగ్రత్తగా చూసుకునేందుకు తల్లులకు.. సంవత్సరానికి ఒక్కో చిన్నారికి 120 చొప్పున చైల్డ్‌కేర్ లీవులు అందజేస్తుంది ప్రభుత్వం. అయితే పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చే వరకే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికెట్ ఉంటే సెలవు మంజూరు చేస్తారు.

చూశారుగా.. తల్లవ్వడానికి ప్రపంచంలో కొన్ని అత్యుత్తమ దేశాలేంటో.. ఈ సదుపాయాలన్నీ చూస్తుంటే వెంటనే అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తోంది కదూ..!

ఇదీ చూడండి: ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ABOUT THE AUTHOR

...view details