హైదరాబాద్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు నగరంలో 11 లక్షలకు పైగా వాహనాలకు జరిమానా విధించి స్వాధీనం చేసుకున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 20 వరకు రోజుకు కనీసం 13-15వేల వాహనాలకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 5.15 లక్షలకు పైగా వాహనాలపై జరిమానా విధించారు. వీటిలో 50వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే సుమారు 95శాతం ఉన్నాయి.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లోనూ పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలో కలిపి 6.26 లక్షల వాహనాలపై జరిమానా విధించారు. వీటిలో 50వేలకు పైగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికంగా 5.4లక్షల కేసులు నమోదు చేశారు.