ఏపీలో రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా... ఆ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నాలు చేస్తుండటంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడిపెరిగి సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
వాహనం డెలివరీ చేయకపోవడం వల్ల పలు చోట్ల డీలర్లతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ ఉన్నతాధికారులు.. శుక్రవారం నాటికి వెబ్సైట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని తెలిపారు.