Motor Vehicle Act: కేంద్రం తీసుకువచ్చిన 2019 మోటార్ వెహికిల్ యాక్టు అమలును నిరసిస్తూ వాణిజ్య వాహన యజమానులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని ఇన్ని రోజులు అమలు చేయని తెలంగాణ ప్రభుత్వం... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం, సరకు రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ ఉండాలి. ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై రోజుకు రూ.50 జరిమానా విధిస్తారు.
కరోనా కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయింది. చాలా వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. దాంతో చాలా మంది యజమానులు వారి వాహనాలకు ఫిట్‌నెస్ చేయించలేదు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత వాహనాలు ఎప్పటిలా తిరుగుతున్నాయి. అయితే ఫిట్‌నెస్ తప్పనిసరి చేయడం, ఫిట్‌నెస్ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించడం ఇప్పుడు యజమానులను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా ఫిట్‌నెస్ చేయించని వారు ఇప్పుడు భారీ మొత్తం జరిమానాగా కట్టాల్సి రావడంపై వారు ఆందోళన చెందుతున్నారు.