గతేడాది ఇదే నెలలో రైతుబజార్లలో ఉన్న కూరగాయల ధరలను ప్రస్తుతమున్న వాటితో పోలుస్తూ మార్కెటింగ్ శాఖ విశ్లేషణ చేసింది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలూ పెరిగినట్లు వివరించింది. అత్యధికంగా కిలో టమాటా ధర సుమారు ఏడింతలు పెరిగింది. ఉదాహరణకు 2019 సెప్టెంబరు 10న కిలో టమాటాల ధర హైదరాబాద్ రైతుబజార్లలో కేవలం రూ.6 ఉండగా.. ఈ నెల 19న రూ.41కి చేరింది. బయట చిల్లర మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.50 దాకా విక్రయిస్తున్నారు.
ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ సీజన్‌లో సాధారణంగా లక్షన్నర ఎకరాల్లో వేయాలి. కానీ, 89 వేల ఎకరాల్లోనే వేసినట్లు ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది.
కరోనా, లాక్‌డౌన్ వంటి సమస్యలతో కూలీల కొరత, పెరిగిన కూలి రేట్లను భరించలేక నగరానికి చుట్టుపక్కల జిల్లాల్లో కూరగాయలకు బదులు పత్తి, కంది, వరి తదితర పంటలను రైతులు సాగుచేశారు. రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో ఎప్పుడూ కూరగాయలు సాగుచేసే రైతులు ఈసారి పత్తి వంటి ఇతర పంటలు వేసినట్లు తమ పరిశీలనలో తేలిందని మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. మరో నెలరోజుల దాకా కొరత తీరేలా కనిపించడం లేదని ఆయన వివరించారు.