గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన వీరమల్లేశ్వర ప్రసాద్ బాల్ పాయింట్ పెన్నుతో బొమ్మలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. కుంచె అవసరం లేకుండానే పెన్నుతో చుక్కలు పెడుతూ బొమ్మలు గీయడం ఆయన ప్రత్యేకత. ప్రసాద్ ఒకప్పుడు పసుపు మిల్లులో పనిచేసేవాడు. అప్పుడు జరిగిన ప్రమాదంలో చేతికి గాయమైంది. ఆ సమయంలో కొద్దిరోజులు పని లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లింది. అప్పుడే శివకోటి రాయటం ప్రారంభించారు. దానినే కొంచెం విభిన్నంగా రాయటం మొదలుపెట్టారు.
బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..! శివతత్వం ఉట్టిపడేలా చిత్రాలు
ప్రతి పేజిలోనూ శివలింగాకృతి కనిపించేలా పదాలను తీర్చిదిద్దారు వీరమల్లేశ్వర ప్రసాద్. అందుకోసం రంగుల బాల్ పాయింట్ పెన్నులను వినియోగించాడు. ఆ పుస్తకంలోని పేజీలను చూడగానే శివతత్వం ఉట్టిపడేలా కనిపించేవి. అక్కడి నుంచి ప్రసాద్‌కు బొమ్మలు వేయాలనే తలంపు వచ్చింది. అది కూడా బాల్ పాయింట్ పెన్ సాయంతోనే వేయాలని నిర్ణయించాడు.
పెన్ సాయంతో చుక్కలు పెడుతూ... చిత్రాన్ని పూర్తి చేసేవాడు. అలా చిత్రకారుడిగా తయారయ్యాడు. తాను ఇబ్బందులు పడిన సమయంలో శివకోటి రాయటం, బొమ్మలు గీయటం ద్వారా వాటిని అధిగమించారు ప్రసాద్. ఆత్మస్థైర్యంతో వేరే చోట ఉద్యోగం సంపాదించాడు.
ఆ తర్వాత సొంతంగా ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసుకుని జీవితంలో నిలదొక్కుకున్నాడు. భార్య లక్ష్మి సైతం టైలరింగ్ చేస్తూ ప్రసాద్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది. ప్రసాద్ పని మానేసి బొమ్మలు గీయటం మొదట్లో అంతగా నచ్చేది కాదని... అయితే బొమ్మ పూర్తయిన తర్వాత ఎంతో బాగుండటంతో తన ఆలోచన మార్చుకున్నానని లక్ష్మి తెలిపారు.
కేవలం చుక్కల సాయంతోనే బొమ్మ గీయాల్సి రావటంతో అది పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే ప్రతిరోజు రెండు మూడు గంటలు చిత్రలేఖనానికి కేటాయిస్తాడు ప్రసాద్. ఒక్కో చిత్రం పూర్తి కావటానికి రెండు మూడు నెలల సమయం తీసుకుంటుంది. అయినా సరే అద్భుతమైన చిత్రం వచ్చాక ఆ శ్రమంతా మర్చిపోతాడు ఈ చిత్రకారుడు.