తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణాతీరంలో చమురు తవ్వకాలు..ముప్పు తప్పదంటున్న పర్యావరణవేత్తలు - కృష్ణా తీరం తాజా వార్తలు

ఏపీ కృష్ణా జిల్లాలో రూ. 650 కోట్లతో ప్రతిపాదించిన చమురు, సహజవాయువు బావుల తవ్వకం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రభుత్వ యంత్రాంగం చాలా గోప్యంగా ఉంచుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను బహిరంగపరచకుండా జాగ్రత్తపడుతోంది. ఈనెల 12న కాజ గ్రామంలో ప్రజాభిప్రాయసేకరణ జరుగనుందని... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆయా గ్రామ పంచాయతీలకు నోటీసులు పంపుతున్నా ప్రాజెక్టు స్వరూపాన్ని వెల్లడించడంలేదు. కృష్ణా డెల్టాకు ఈ ప్రాజెక్టు హానికరమని... భవిష్యత్తులో తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

vedantha
కృష్ణాతీరంలో చమురు తవ్వకాలు

By

Published : Apr 11, 2021, 7:45 PM IST

కృష్ణాతీరంలో చమురు తవ్వకాలు

ఏపీ కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడురు, కలిదిండి, మచిలీపట్నం మండలాల పరిధిలో వేదాంత సంస్థ 35 చమురు, సహజవాయువు బావులను తవ్వనుంది. ఇది ఆన్‌షోర్‌ ప్రాజెక్టు. ఈ ప్రాంతం అంతా కేజీ బేసిన్‌లోని కాజ బ్లాక్‌ పరిధిలోకి వస్తుంది. 114.93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేదాంత సంస్థకు చెందిన చమురు, సహజ వాయువు విభాగం కెయిర్న్‌ ఆధ్వర్యంలో సుమారు రూ. 650 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలన్నది ప్రతిపాదన.

దీనికి సంబంధించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికను ఈకో కెమ్‌ సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి...గత ఏడాది డిసెంబరు 17న గూడూరు మండలం తురకతూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది. ఇప్పుడు మొవ్వ మండలం కాజలో...ఈనెల 12న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది.

చమురు, సహజ నిల్వల అంచనా..

వేదాంత సంస్థ తవ్వనున్న 35 బావుల్లో మొవ్వ మండలంలో 14, గూడూరులో 18, కలిదిండిలో రెండు, మచిలీపట్నంలో ఒకటి ఉన్నాయి. ఈ బ్లాక్‌లో చమురు, సహజవాయువు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు ఓఎన్జీసీ గతంలో 3 చోట్ల బావులు తవ్వింది. వాటిలో రెండుచోట్ల ఏమీ లభించలేదు. రాఘవపురం ప్రాంతంలో తవ్విన బావి ద్వారా ఈ ప్రాంతంలో సహజవాయువు ఉందని గుర్తించింది. చమురు నిల్వలూ ఉండే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయానికి వచ్చింది.

హైడ్రో ఫ్యాక్చరింగ్‌ విధానం ద్వారా మరింతగా గ్యాస్‌ నిల్వల్ని వెలికి తీయవచ్చని అంచనా వేశారు. కాజ బ్లాక్‌లో తవ్వనున్న 35 బావుల నుంచి రోజుకి 30 వేల బారెళ్ల చమురు, 30 మిలియన్‌ ఘనపుటడుగుల సహజవాయువు వెలికి తీయలేమని వేదాంత సంస్థ అంచనా వేస్తోంది.

పర్యవరణ శాస్త్రవేత్తల ఆందోళన..

వేదాంత సంస్థ చమురు బావులు తవ్వుతామని చెబుతున్న ప్రాంతంలో భూమి లోపల ఉన్నవి అన్నీ మెత్తటి రాళ్లేనని..అక్కడ తవ్వకాలు జరిపితే భూమి కుంగిపోయి పల్లపు ప్రాంతంగా మారిపోతుందని పర్యవరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు బావులు తవ్వకం వల్ల సారవంతమైన కృష్ణా డెల్టా విషపూరితమయ్యే ప్రమాదముందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ కార్యదర్శులకు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. చమురు బావుల వ్యర్థ జలాల కారణంగా స్థానిక నీటి ప్రవాహాల్లో రేడియో ధార్మికత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కోల్పోనున్న రైతులు, వివిధ వృత్తుల వారు..

శాస్త్రవేత్తల సంస్థ కన్వీనరు బాబురావు నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం గ్రామాల్లో పర్యటించి- ప్రజలతో చమురు, సహజ వాయువుల ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల... 850 చదరపు కిలోమీటర్ల మేర ప్రభావితం అవుతుందని..కానీ ఈప్రాంత ప్రజలకు దీనిపై అవగాహన లేదనే విషయాన్ని గుర్తించారు. ప్రతిపాదిత ప్రదేశంలోని భూమిపై ఆధారపడిన రైతులు, వివిధ వృత్తుల వారు ఉపాధి కోల్పోతారనే విషయాన్ని వివరించారు. వీలైనంత వరకు ఈ ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను తీసుకోకుండా చూడాలని.. ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌ను ప్రజాభిప్రాయసేకరణ వేదిక వద్ద గట్టిగా వినిపించాలని సూచించారు.

ఇదీ చూడండి:బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

ABOUT THE AUTHOR

...view details