బెయిల్ పొడిగించాలంటూ బాంబే హైకోర్టులో విరసం నేత, కవి వరవరరావు ( Varavara Rao) పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యం కారణంగా బెయిల్ గడువును పొడిగించాలని వరవరరావు కోరారు. నేటితో బెయిల్ గడువు ముగియడంతో... వరవరరావు ( Varavara Rao) వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న బాంబే హైకోర్టు... తీర్పును 24వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు బెయిల్‌పై యథాతథ స్థితి కొనసాగనుంది.
ఇదీ నేపథ్యం
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో (Bhima Koregaon) 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుకా మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్ అల్లర్లకు (Bhima Koregaon case) కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషద్‌కు చెందిన సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు.
లేఖ ఆధారంగా అరెస్ట్
ఈ సందర్భంగా విల్సన్ ఇంట్లో మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నామని, వాటిలోని ఒకదాన్లో ప్రధాని మోదీరాజ్‌కు చరమగీతం పాడేందుకు వీలైతే రాజీవ్‌గాంధీ తరహాలో అంతమొందించాలని ఉందని పోలీసులు వెల్లడించారు. మరో లేఖలో వరవరరావు పేరు ఉందని, దేశవ్యాప్తంగా దాడులు జరిపే బాధ్యతలను వరవరరావుకు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా 2018 ఆగస్టులో ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు.