కాశీ విశ్వనాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశిష్టమైనదిగా కాశీ విశ్వనాథుడిని పేర్కొంటారు. పవిత్ర గంగానదీ తీరాన వున్న ఈ మందిరంలో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆలయం పలు దండయాత్రల్లో శిథిలమయింది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాభాయి హోల్కార్ ఆలయాన్ని పునరుద్ధరించారు. రుగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణంలోని కాశీఖండంలో ఈ ఆలయం గురించిన వివరాలున్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథుని మందిర నమూనాలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా వీక్షించాలి.
కాశీ విశాలాక్షి
ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ క్షేత్రం ఆరాధ్యనిలయం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి.
అన్నపూర్ణ ఆలయం: సకల ప్రాణకోటికి చోదకశక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతేఅందిస్తుంది కనుకే అన్నపూర్ణ మాతగా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తే అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. రామ భక్త హనుమాన్ ఆలయం సంకట్‌మోచన్ మందిరాన్ని కూడా వీక్షించాలి.
ఆదిశంకరుని రచనలు...
ఆద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరులకు ఈ నగరంతో మంచి అనుబంధముంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం ... తదితర గ్రంథాలు రచించారు. రామకృష్ణపరమహంస, కబీర్, తులసీదాస్, రవిదాస్...ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తమ ప్రసంగాల్లో, రచనల్లో విశేషంగా ప్రస్తావించారు.
అంతిమ సంస్కారాలకు నిలయం..
కాశీలో కన్నుమూస్తే శివసాయుజ్యం పొందుతారని ఆర్యోక్తి. దీంతో వయోధికులు అనేకమంది కాశీలోనే తమ అంత్యజీవితాన్ని గడపాలని వస్తుంటారు. గంగాతీరంలో 80కు పైగా ఘాట్లు వున్నాయి. వీటిలో దశాశ్వమేధ్‌ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్... ముఖ్యమైనవి. దశాశ్వమేథ్‌ఘాట్‌లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘాట్‌లోనే గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. మణికర్ణికఘాట్‌ను మహావిష్ణువే నిర్మించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఘాట్‌ను నిర్మిస్తుండగా విష్ణువు కుండలం ఇందులో పడిపోయింది. అందుకు అంత పవిత్రమైన ప్రదేశంగా భాసిల్లుతోంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో మహేశ్వరుడు తారక మంత్రాన్ని చెబుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిశ్చంద్రఘాట్‌లో హరిశ్చంద్రుడే కాటికాపరిగా బాధ్యతలు నిర్వహించడంతో ఆయన పేరు మీద ఘాట్‌కు పేరు వచ్చింది.
అన్ని మతాలకు పవిత్రభూమి: కాశీ కేవలం హిందువులకే కాదు బౌద్ధం, జైన మతాలకు పవిత్రభూమి. బౌద్దులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించడంతో జైనులకు పవిత్రక్షేత్రమైంది. కాశీ సమీపంలోని సారనాథ్‌లో బుద్ధుడు తొలి ప్రసంగం చేశారు. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల స్థూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది.
ఎలా చేరుకోవచ్చు
- దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
- వారణాసి సమీపంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పెద్ద జంక్షన్. నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వేస్టేషన్ ద్వారా వెళుతుంటాయి.
- వారణాసి విమానాశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు.
ఇదీ చదవండి: శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు