Vaikuntha Ekadashi in Telangana 2022 :వైకుంఠ ఏకాదశి పర్వదిన వేళ వైష్ణవ ఆలయాల్లో రద్దీ Vaikuntha Ekadashi in Telangana 2022 : రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాదాయి. ఉదయం నాలుగు గంటల నుంచే కోవెళ్లకు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉత్తర ద్వారదర్శనం వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి రెండు గంటల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. పూల అలంకారంలో వజ్రవైఢూర్యాలతో స్వామివారు చూడముచ్చటగా కనిపించారు.
ఆకట్టుకున్న అలంకరణలు
Vaikuntha Ekadashi 2022: హన్మకొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తులకు చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్‌లోని శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ ఆలయం, నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని వెంకటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రత్యేక పూజలు
Vaikuntha Ekadashi Celebrations 2022 : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీ సమేత,యోగ,ఉగ్ర నరసింహ,శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్‌లను భక్తులు దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం తిమ్మాపుర్ శివారులోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఉత్తర తిరుమల, సుభాష్ నగర్ రామాలయం, కంటేశ్వర దేవాలయంలో అభిషేకం, అర్చన, అలంకరణ తర్వాత ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు
ఉత్తర ద్వారం ద్వారా దర్శనం
Vaikuntha Ekadashi Puja: హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివేకానంద నగర్ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోష్‌నగర్‌లోని వెంకటేశ్వర ఆలయ ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని విజయలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
సెలవులకు సొంతూళ్లకు వెళ్లడం, కొవిడ్ నిబంధనలతో గత సంవత్సరంతో పోలిస్తే భక్తుల రద్దీ కాస్త తగ్గింది.