తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత తెలుసా...? - వైకుంఠ ఏకాదశి పూజలు

అత్యంత శ్రేష్ఠమైన ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటీ? ఈ పర్వదినాన ఏం చేయాలి...? అసలు ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు..? లాంటి ఎన్నో ధర్మ సందేహాలను ఈ పర్వదినం సందర్భంగా నివృత్తి చేసుకుందాం రండి.

vaikunta ekadasi speciality
vaikunta ekadasi speciality

By

Published : Dec 25, 2020, 4:55 PM IST

మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈసారి శుక్రవారం (ఈ నెల 25న) ఏకాదశి వచ్చింది. ఆ రోజంతా ఉంటుంది. అశ్వనీ నక్షత్రమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలే సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆ రోజు ఏం చేయాలి?

వైకుంఠ ఏకాదశి రోజున ప్రతిఒక్కరూ బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తిచేసుకోవాలి. భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును ఆరాధిస్తారో.. ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది.

  • మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీ మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి.
  • ఏకాదశి అంతరార్థం ఏమిటంటే.. ఏకాదశి అనగా 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం.
  • ఉపవాసం అంటే.. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఉప+ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం.
  • ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించేవారికి జ్ఞానం కలుగుతుంది. భగవత్‌తత్వం బోధపడుతుంది.
  • ప్రతి నెలలో ఏకాదశి రెండుసార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది. మోక్షప్రదమైనది. అత్యంత పవిత్రమైనది.
  • ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది.
  • ఏకాదశి తిథి యమప్రీతి. ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు వారములలో భానువారం (ఆదివారం). తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు.
  • దశమినాడు ఏకభుక్తము. ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు. ద్వాదశి నాడు అన్నసమారాధనము మరియు ఏకభుక్తము.. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు?

సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణుభక్తులు, దేవతలను హింసించడం మొదలు పెట్టగా.. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, రుషులు కలిసి శ్రీ మహా విష్ణువును ప్రార్థించగా.. మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది.ఈ యుద్ధంలో మహా విష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకొనేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణు మూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా.. విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి.. ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని.. ఎవరైతే ఆరోజు ఉపవాస దీక్ష చేస్తారో.. వారు సర్వవిధ పాపాలనుంచి విముక్తి పొందుతారని మహా విష్ణువు అభయమిచ్చెను. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాపవిముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహా విష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాపపరిహారం ఉండదని మహా విష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరి నామస్మరణతో గడిపిన వారికి మహా విష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.

వైకుంఠ ఏకాదశికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆలయాలు ఇవే..

  • తిరుమల తిరుపతి దేవస్థానం- తిరుమల
  • నరసింహస్వామి దేవాలయం- అహోబిలం, కర్నూలు జిల్లా
  • శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం- భద్రాద్రి
  • వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం - అన్నవరం, తూర్పుగోదావరి
  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం - యాదాద్రి
  • కోదండరామస్వామి ఆలయం - ఒంటిమిట్ట, కడప జిల్లా
  • వెంకటేశ్వరస్వామి ఆలయం- ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి)- పశ్చిమగోదావరి జిల్లా
  • శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం- సింహాచలం, విశాఖ జిల్లా

వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయాలు దర్శించుకోవడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. ఇవేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: క్రిస్మస్ వెలుగులు... రంగురంగుల విద్యుత్ కాంతులు

ABOUT THE AUTHOR

...view details