తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ - tirumala news

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 3 వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే....ఈ ఏడాది సర్వదర్శనానికి తిరుపతిలోని స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడం వల్ల తితిదే ముమ్మర చర్యలు చేపట్టింది.

tirumala news
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ

By

Published : Dec 24, 2020, 7:19 AM IST

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించిన తితిదే.. సర్వదర్శన టోకెన్లను తిరుపతి వారికే జారీ చేస్తోంది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3 వరకు రోజుకు పదివేల మంది చొప్పున పది రోజుల పాటు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. కిందటేడాది వరకు ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన తితిదే... ఈ ఏడాది నుంచి సంప్రదాయాన్ని మారుస్తూ పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవాలని నిర్ణయం తీసుకొంది.

వైకుంఠ ద్వారం నుంచి దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలు ఏర్పడింది. ఇప్పటికే 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు అందచేసిన తితిదే.... సర్వదర్శన టోకెన్ల జారీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ టోకెన్లు తీసుకొనేందుకు వీలుగా కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేసింది.

ఇతర ప్రాంతాల ప్రజలు రావొద్దు...

కరోనా కారణంగా....సర్వదర్శన టోకెన్ల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లు ఈవో జవహార్‌ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని 5 ప్రాంతాల్లో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే పరిమితం చేశామని...ఇతర ప్రాంతాల ప్రజలెవరూ రావొద్దని కోరారు. వైకుంఠ ద్వారదర్శన టికెట్ల కోసం భక్తులు పొటెత్తారు. రాత్రి పది గంటల నుంచే కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. లక్ష టికెట్లు పూర్తయ్యే వరకు క్యూలైన్లలో నిలబడిన వారందరికీ పంపిణీ చేయనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇవీచూడండి: వైకుంఠ ద్వార దర్శనానికి.. తిరుమల ముస్తాబు

శ్రీవారిమెట్టు వద్ద భక్తుల బైఠాయింపు.. ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details