తెలంగాణ

telangana

ETV Bharat / city

వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

అందరికీ కొవిడ్ టీకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిస్తోంది. వచ్చే నెల నుంచి 18ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​కు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్లు ఇప్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించనున్నారు.

Vaccination in the state
వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

By

Published : Apr 21, 2021, 7:36 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర రాజధానితో పాటు శివారు ప్రాంతాలు, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది. ఇతర జిల్లాల్లోనూ కేసులు బాగానే నమోదవుతున్నాయి. పట్టణప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అంతగా లేనప్పటికీ అక్కడ కూడా కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజుల నుంచి ఊపందుకొంది. ఇప్పటి వరకు రెండు డోసులు టీకా తీసుకున్న వారి సంఖ్య 4,00,132 కాగా మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 28,68,553కు చేరుకుంది.

కేంద్రం అనుమతి

ఇప్పటి వరకు హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లెవల్ వారియర్స్​తో పాటు 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో వీలైనంత త్వరగా అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వీలైనంత త్వరగా అందరికీ టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. ఉత్పత్తిదారుల నుంచి టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. దీంతో ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న సర్కారు

రాష్ట్రానికి అవసరమైన టీకాలను కొనుగోలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అర్హులందరికీ టీకాలు ఇచ్చేలా కొనుగోళ్లు చేసేందుకు 700 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు టీకాల కొనుగోలుపై సర్కార్ కసరత్తు చేయనుంది. త్వరలోనే సంబంధిత వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details