Vaccination In Telangana: రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి ప్రభుత్వం కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభించగా... తొలిరోజే మంచి స్పందన వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్యవారు రాష్ట్రంలో 18 లక్షల 41 మంది ఉండగా.... అందులో తొలి రోజు 24 వేల 240 మంది టీకా తీసుకున్నట్టు స్పష్టంచేసింది. మరో నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 2 వేల408 మంది టీకా తీసుకోగా... ఆ తర్వాత స్థానంలో 2 వేల 294 మందితో భద్రాద్రి జిల్లా ఉంది. సిరిసిల్ల జిల్లాలో అతిస్వల్పంగా కేవలం 36 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్‌లో 1,895 మంది వ్యాక్సిన్ వేసుకోగా... రంగారెడ్డి జిల్లాలో 1,825 మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరంలేదని... 15నుంచి 18 ఏళ్లవారికి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు టీకా ఇప్పించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి కొవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వైద్యశాఖ.... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.