Vaccination for Children: కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా గత ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ దశలవారీగా ముందుకు సాగుతోంది. తాజాగా 12 ఏళ్లు పైబడిన వారికి బుధవారం(మార్చి 16) నుంచి టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోనూ నేటి నుంచి 12 పైబడిన వారికి టీకా ఇవ్వనున్నట్టు సర్కారు స్పష్టం చేసింది. 12 నుంచి 14 ఏళ్ల వారికి మాత్రం హైదరాబాద్‌కు చెందిన 'బయోలాజికల్ ఈ' సంస్థ తయారు చేసిన కార్బివ్యాక్స్ని ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
పూర్తిస్థాయిలో ఏర్పాట్లు..
రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది చిన్నారులు 12 ఏళ్ల నుంచి.. 14 ఏళ్ల మధ్య ఉన్నట్టు సమాచారం. వారందరికీ ఇవాళ్టి నుంచి టీకా ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలకు టీకాలను పంపటంతో పాటు.. ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు, వ్యాక్సినేటర్లకు టీకా పంపిణీకి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది.
కొవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నవాళ్లకే..
పిల్లలకు కార్బివ్యాక్స్ 0.5 ఎంఎల్ని ఒక్కో డోస్‌గా ఇవ్వనున్నారు. రెండు డోస్‌ల మధ్య 28 రోజుల వ్యవధి ఉండాలని అధికారులకు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు గంటసేపు పిల్లలు వ్యాక్సిన్ కేంద్రంలోనే పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని డీహెచ్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఇక కొవిన్‌లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా టీకా పొందవచ్చని పేర్కొన్న సర్కారు.. విద్యాశాఖతో కలిసి టీకా పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో దాదాపు 1.7 లక్షల మంది చిన్నారులు అర్హత కలిగి ఉన్న నేపథ్యంలో స్థానిక పాఠశాలలు, విద్యాశాఖ అధికారులతో టీకా పంపిణీపై చర్చించినట్టు డీఎంహెచ్‌వో డా.వెంకట్ వివరించారు.
బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభం..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే 60 ఏళ్లు పైబడిన వారికే బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండో డోస్ తీసుకుని 9 నెలల గడువు ముగిసిన వారు బూస్టర్‌డోస్ తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తొలిడోస్ దాదాపు 106 శాతం పూర్తి కాగా... రెండో డోస్ 97 శాతం పూర్తి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చిన్నారుల వ్యాక్సినేషన్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేపడతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పిల్లలకు టీకా ఇప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని సూచించారు. పిల్లలకు తప్పకుండా వ్యాక్సిన్ ఇప్పించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: