Vacancies in State Govt Departments: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ నెల రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటివరకు ఆయన నిర్వర్తించిన సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అప్పట్నుంచి ఆ బాధ్యతల్లో ఎవరినీ నియమించలేదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి తర్వాత... అంత ప్రాధాన్యం ఉండే అతి కొద్ది పోస్టుల్లో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఒకటి.
నిత్యం సర్కార్ కార్యకలాపాలు, మంత్రివర్గ విషయాలు... కేంద్రంతో సంప్రదింపులు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీస్‌అధికారులు, సచివాలయఉద్యోగుల సంబంధితఅంశాలు,ప్రోటోకాల్, విజిలెన్స్ సహా వివిధ కార్యకలాపాలను, జీఏడీ బాధ్యతలు చూసే కార్యదర్శే నిర్వర్తిస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధారణ పరిపాలనా శాఖ అత్యంత కీలకం. వికాస్‌రాజ్ రిలీవ్ అయినప్పటి నుంచి ఆ బాధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడం వల్ల ప్రభుత్వప్రధానకార్యదర్శేచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ ఇప్పటికే రెవెన్యూ,వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, గనుల శాఖల బాధ్యతలు, కీలకమైన సీసీఎల్ఏ విధులను... అదనంగా నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసరాజు బదిలీ తర్వాత పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖలు సీఎస్ వద్దే ఉన్నాయి. ఆయా శాఖలకు అధికారులు నియమించాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. జీఏడీ ఆ జాబితాలో చేరింది. మరో కీలకశాఖ అయిన న్యాయశాఖ కార్యదర్శి ఖాళీగా ఉంది. మొన్నటివరకు న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సంతోశ్‌రెడ్డి... రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై బాధ్యతలు స్వీకరించడం వల్ల ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. ఆ బాధ్యతలను ఇప్పటివరకు ఎవరికీ అప్పగించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ఏ శాఖ కార్యదర్శి పోస్టు ఖాళీ అయినా వెంటనే ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, ఈసారి చాలారోజులైనా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే పలు శాఖల బాధ్యతలను అధికారులు అదనంగా నిర్వర్తిస్తున్నారు. కొందరు అధికారులు... మూడు, నాలుగు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. అంతగా పనిలేకపోయినా కొన్ని శాఖల్లో ఇద్దరు చొప్పున అధికారులను నియమించారు. తమకు పెద్దగా పని లేదని సదరు అధికారులు వాపోతున్నారు. పూర్తిస్థాయి అధికారులను నియమించాలని రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగులు కోరుతున్నారు. చాలా శాఖలు అధికారుల కోసం ఎదురుచూస్తుండగా... ప్రాధాన్య పోస్టింగుల కోసం మరికొందరు అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి:Pudding Pub Case : పుడింగ్ పబ్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ