ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత కాంట్రాక్టరు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను తప్పుకోమంటూ ప్రీక్లోజర్ నోటీసు జారీ చేసింది. 60 సీ నిబంధన ప్రకారం పాత కాంట్రాక్టరును తప్పిస్తూ నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయించటంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ప్రీక్లోజర్ నోటీసు జారీ చేస్తున్నట్టు జలవనరుల శాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు సుధాకర్ బాబు పేరిట ఈ నోటీసులు నవయుగ సంస్థకు జారీ అయ్యాయి.
స్పిల్ వేలో క్రస్ట్ లెవల్ పనులు, స్పిల్ ఛానల్ పనులకు గానూ రూ.1244.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని పోలవరం చీఫ్ ఇంజినీర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు రూ. 918 కోట్లు, కాఫర్ డ్యామ్లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్ ఛానల్ పనుల కోసం మరో 751 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చిన ఈ పనుల్ని ఒప్పందంలోని 89.3 నియమావళి కింద ప్రీక్లోజర్ చేయాలని నిర్ణయించినట్టు పోలవరం చీఫ్ ఇంజినీర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు 60 సి ప్రకారం నామినేషన్ ప్రాతిపదికన ఈ పనుల్ని గత ప్రభుత్వం అప్పగించింది.