ఎగువ సీలేరు దగ్గర రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టు (పీఎస్‌పీ) నిర్మాణ ప్రతిపాదనపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా ఉండటంతో పాటు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఎగువ సీలేరు దగ్గర 1,350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్‌పీ ఏర్పాటుకు వ్యాప్కోస్ సంస్థ సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసింది. వ్యాప్కోస్ ప్రాథమిక అంచనా ప్రకారం నిర్మాణ వ్యయాన్ని పరిశీలించిన అధికారులు.. ప్రాజెక్టు ఏర్పాటు లాభసాటి కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏపీ జెన్‌కో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.
ఏపీలో 29 పీఎస్‌పీల ఏర్పాటు ద్వారా 32 వేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) అంచనా. సివిల్, ఎలక్ట్రోమెకానికల్ ఖర్చులు కలిపి మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.5 కోట్ల వరకు వెచ్చిస్తే ప్రాజెక్టు ఏర్పాటు లాభసాటిగా ఉంటుంది. ప్రాజెక్టు ప్రారంభంలో యూనిట్ ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నా.. 40 ఏళ్ల జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నెడ్‌క్యాప్ తేల్చింది.
ఎగువ సీలేరు దగ్గర ప్రతిపాదించిన ప్రాజెక్టుపై డీపీఆర్‌ల ప్రకారం మెగావాట్‌కు సుమారు రూ.11 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం సుమారు రూ.14,850 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు 800 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇందుకోసం ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రూ.1,600 కోట్లు చెల్లించాలి. దీనికితోడు దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు రావటంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే విద్యుదుత్పత్తి ప్రారంభం ఆలస్యమై మరింత నష్టపోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.