తెలంగాణ

telangana

ETV Bharat / city

uppalapadu bird sanctuary: ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి

విదేశీ పక్షుల అడ్డాగా పేరొందిన ఏపీలోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం కొత్త హంగులు సంతరించుకుంటోంది. పలు దేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు వచ్చే సందర్శకులకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ, వాటి సంతానోత్పత్తి పెంచుకునేందుకు మరిన్ని ఏర్పాట్లు చేస్తూ... సంరక్షణ కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.

ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి
ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి

By

Published : Jul 25, 2021, 1:14 PM IST

ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి

ఏపీలోని గుంటూరు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంటుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా విదేశాల నుంచి పక్షులు ఇక్కడకు వలస వస్తున్నాయి. ఉప్పలపాడులోని చెరువును వాటికి ఆవాసంగా మార్చుకున్నాయి.

పెరుగుతున్న పక్షుల రాక..

ప్రతీ ఏడాదికి పక్షుల రాక పెరుగుతుండటంతో 25 ఏళ్ల క్రితం ఇక్కడ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంరక్షణా కేంద్రానికి చైనా, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, సైబీరియా పక్షులు.. ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్‌ స్టార్క్స్.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్ దక్షిణాఫ్రికా నుంచి వైట్‌ ఐబిస్‌.. వంటి పక్షి జాతులు వచ్చి.. తమ సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి. వీటి గురించి ప్రకృతి ప్రేమికులకు తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

"పక్షుల కూతలను సందర్శకులు వినేలా ఏర్పాట్లు చేయనున్నాం. నీటికుక్కల కోసం సాండ్ బెడ్ ఏర్పాటు చేస్తున్నాం. సందర్శకుల కోసం అన్ని రకాల వసతులు కల్పించాం. సందర్శకులు.. పక్షుల గురించి తెలుసుకునేలా వాటి వివరణ బోర్డులు కూడా పెడుతున్నాం. "

- రామచంద్ర, అటవీశాఖ అధికారి, గుంటూరు

స్థానికుల హర్షం..

ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి దాదాపు ముప్పై రకాల విదేశీ పక్షులు వస్తుంటాయి. మొదట్లో పెలికాన్, ఓపెన్ బిల్ స్టార్క్ మాత్రమే వచ్చేవి.. ఇప్పుడైతే, తెల్లకొంగ, ఎర్ర కాళ్ల కొంగ, చుక్కల ముక్కు బాతు, పెదవి ముక్కు కొంగ, నల్లతల కంకణం, పాము బాతు, చిన్ననీటి కాకి, కందురెక్కల బదాని, దోసికొంగ, మునుగుడి కోడి, తెల్లబొర్ర నీటి కోడి, జంబుకోడి, నల్లబౌలి కోడి వంటి పేర్లతో స్థానికులు పిలుచుకుంటారు. ఎక్కువగా చుక్కల బాతు, తెల్ల కొంగ, ఎర్ర కాళ్ల కొంగ, కొంగలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. విదేశీ పక్షుల రాకతో తమ గ్రామానికి ఎంతో పేరు వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

" ఒక జాతి పక్షులు వచ్చి వెళ్లిన తర్వాత.. మరో జాతి పక్షులు వలస వస్తాయి. ఏ రకం పక్షులు ఏ చెట్టు మీద ఉంటాయో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. పుట్టింటికి ఆడబిడ్డ వస్తే ఎంత అపురూపంగా చూసుకుంటామో.. వలస వచ్చిన విదేశీ పక్షులను అంతే అపురూపంగా చూసుకుంటాం. "

- అనిల్ కుమార్, ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఛైర్మన్

అధికారుల చర్యలు..

పెరుగుతున్న పక్షుల సంఖ్యకు తగ్గట్టుగా సౌకర్యాలు మెరుగుపరిచేలా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పక్షిగూళ్ల కోసం చెరువులో నల్లతుమ్మ చెట్లు పెంచుతున్నారు. ఇటీవల ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేశారు. త్రీడీ బర్డ్ మోడల్స్ ప్రదర్శించటంతో పాటు, ఇంటరాక్టివ్ వాయిస్ విధానంలో సందర్శకులకు పక్షుల కూతలు వినేలా, వాటి జీవన శైలి వివరించేలా అదనపు సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. కరోనా కారణంగా మూతపడిన సంరక్షణ కేంద్రం కొద్దిరోజుల క్రితమే తిరిగి తెరుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details