ఆయన పేరు శ్రీనివాసరావు, ఆమె పేరు జ్యోతి (పేర్లు మార్చాం). వారికో పాప. ఖమ్మం పట్టణంలో నివాసం. రెండేళ్ల క్రితం రుణం తీసుకుని ఆటో కొలుగోలు చేశారు. మార్చికి ముందు.. రోజూ రూ.700 వరకు ఆదాయం వస్తుండేది. దానితో జీవితం హాయిగా గడిచిపోయేది. కరోనా ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. నాలుగు రోజుల క్రితం.. ఇక జీవితం ముగించాలనుకునే దీన స్థితికి వారు రాగా.. బంధువులు ధైర్యం చెప్పి ఆ ఆలోచనను విరపింపజేశారు.
రూ.7 వేలు కిస్తీ, ఇంటి అద్దె రూ.2500, పాపకు రూ.2 వేలు, ఇతర ఖర్చులు రూ.3 వేలతో కలిపి రూ.14,500 ప్రతి నెలా వారికి అవసరం. ప్రస్తుతం రోజుకు రూ.300 కూడా ఆదాయం రావడం లేదు. ‘ఎవర్ని అడిగినా సాయం చేయడం లేదు. మాలాంటి మధ్యతరగతి ప్రజల జీవితాలను కరోనా కూల్చేసింది’ అంటూ శ్రీనివాసరావు సతీమణి ‘ఈనాడు’తో కన్నీరు మున్నీరయ్యారు. శ్రీనివాసరావు, జ్యోతి కుటుంబం ఒక్కటేకాదు. ఖమ్మంలోనే ఉండే ఆయన సహచరులు కరీం, మక్బూల్, శ్రీశైలం కుటుంబాలు కూడా ఇదే స్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆటోలు ఎక్కేవారు పెద్దగా ఉండటం లేదు.
ఉపాధి లేక ఇబ్బందుల్లో..
రాష్ట్రంలో ఏడున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లు, యజమానులు ఉన్నారు. వీరిలో చాలా మందిపై ఆ ప్రభావం పడింది. ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ప్రభాకర్ అనే వడ్రంగి మేస్త్రి నలుగురు కూలీలతో కలిసి భవనాల్లో అల్మరాలు, డెకోలం పనులు చేస్తుంటారు.
కూలీలు రాకపోవడంతో పనులు కదలడం లేదని, మరోవైపు ఇళ్ల యజమానులు ఒత్తిడి తెస్తున్నారని ఆ మేస్త్రి వాపోయారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అసంఘటిత రంగాలకు చెందిన కుటుంబాలు ఆగమాగం అవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు తగిన ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారు.