కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు చాలా సంతోషంగా ఉన్నాడన్న నిర్మలా... ప్రస్తుతం యార్డులు, మధ్యవర్తులకు పన్నులు కడుతున్నారని చెప్పారు. కొత్త చట్టాల ద్వారా ఎవరికీ పన్ను కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇకనుంచి మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదని నిర్మలా సీతారామన్ వివరించారు. రైతుకు వచ్చే ఆదాయంలో 8 శాతం పన్నులకే పోతోందన్న కేంద్రమంత్రి... యూపీఏ ప్రభుత్వం వరి, గోధుమకే కనీస మద్దతు ధర ఇచ్చిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం 22 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తోందని వివరించారు. కూరగాయల రైతుకూ గిట్టుబాటు ధర రావాలనేది తమ విధానమని స్పష్టం చేశారు. కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు.