విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, కొత్త వాటికి భూమిపూజలు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఏపీకి వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం జగన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గడ్కరీ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఫొటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చెందినవి 13 వేల 806 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కాగా, రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కు చెందినవి 7 వేల 753 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని రేచర్ల-గురవాయిగూడెం-దేవరపల్లి మధ్య రెండు ప్యాకేజీల్లో 56.89 కిలో మీటర్లు, 12 వందల 81 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఏపీ, తమిళనాడులో చిత్తూరు-తట్చూరు హైవే కింద 3 ప్యాకేజీల్లో 96.04 కిలో మీటర్లు, 3 వేల 178 కోట్ల రూపాయలతో 6 వరుసల రహదారి నిర్మాణానికి పునాదిరాయి వేయనున్నారు. రాజమహేంద్రవరం-విజయనగరం జాతీయ రహదారిలో 3 ప్యాకేజీలు కలిపి వెయ్యి 21 కోట్ల రూపాయలతో 2 వరుసలుగా విస్తరణ చేపట్టనున్నారు. నాగార్జునసాగర్ నుంచి దావులపల్లి వరకు 2 వరుసలుగా విస్తరణ అనంతపురంలోని టవర్‌క్లాక్, కలెక్టరేట్ మీదుగా పంగల్‌రోడ్ వరకు 4 వరుసలుగా విస్తరణ , భద్రాచలం-కుంట మధ్య 2 వరుసలుగా విస్తరణ, కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మధ్య 53.59 కిలో మీటర్లు 2 వరుసలుగా విస్తరణ చేపట్టనున్నారు.
పశ్చిమగోదావరిలోని గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు 70 కిలో మీటర్లు, 2 వేల 676 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారిని ప్రారంభించనున్నారు. చిత్తూరు-మల్లవరం మధ్య 61.13 కిలోమీటర్లు 2 వేల 330 కోట్లతో నిర్మించిన 6 వరుసల రహదారిని ప్రారంభిస్తారు. నరసన్నపేట-రణస్థలం మధ్య 50 కిలోమీటర్లు 14 వందల 57 కోట్ల రూపాయలతో 6 వరుసలుగా విస్తరణ చేపట్టిన రహదారిని ప్రారంభించనున్నారు. గిద్దలూరు-వినుకొండ మధ్య నిర్మించిన2 వరుసల రహదారిని, కలపర్రు నుంచి చిన్నఅవుటపల్లి వరకు 6 వరుసలుగా విస్తరించిన దారిని ప్రారంభిస్తారు. అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి మడకశిర వరకు 2వరుసలుగా విస్తరణ చేపట్టిన రహదారిని, మదనపల్లి-పుంగనూరు-పలమనేరు మధ్య 54 కిలోమీటర్లు విస్తరించిన దారిని ప్రారంభిస్తారు. కేంద్రమంత్రి పర్యటన, బహిరంగసభ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
బెంజిసర్కిల్ రెండో వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గడ్కరీ రావాల్సి ఉన్నప్పటికీ పర్యటన గతంలో రెండుసార్లు వాయిదా పడినందున.. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలు అన్నింటినీ ఒకేచోట నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అధికారులతో గడ్కరీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల పనులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న తరుణంలో పార్టీపరంగానూ గడ్కరీకి ఘనస్వాగతం పలకాలని భాజపా నిర్ణయించింది. ఏర్పాట్లును భాజపా నేతలు పరిశీలించారు. గడ్కరీని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సత్కరించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో గడ్కరీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు గడ్కరీ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్లనున్నారు.