తెలంగాణ

telangana

ETV Bharat / city

Nirmala Seetharaman AP Visit : ఏపీకి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్‌ - telangana news

Nirmala Seetharaman AP Visit : ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కేంద్రం తండ్రి స్థానంలో ఉండి... పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ భరోసా ఇచ్చారు. విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి సహాయం అందించడం కోసమే.. కేంద్ర ప్రభుత్వం నాసిన్‌ను మంజూరు చేసిందన్నారు. 2023 సెప్టెంబర్‌ నుంచి ఐఏఎస్​కు ఎంపికైన అభ్యర్థులకు అనంతపురం నాసిన్‌ ప్రాంగణంలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Nirmala Seetharaman AP Visit
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

By

Published : Mar 6, 2022, 10:08 AM IST

Nirmala Seetharaman AP Visit : ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం తండ్రి స్థానంలో ఉంటూ ఆదుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఏపీకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌... ప్రధాని మోదీని తండ్రిలాగా అప్యాయంగా చూస్తున్నారని, ఆయన ఎప్పుడు దిల్లీ వచ్చినా ప్రధానిని కాదనకుండా కలుస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు. విభజన అనంతరం నష్టపోయిన రాష్ట్రానికి సాయం అందించేందుకు కేంద్రం నాసిన్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌)ను మంజూరు చేసిందని వివరించారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించనున్న నాసిన్‌ క్యాంపస్‌కు శనివారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐఏఎస్‌లకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ ఎలాగో ఐఆర్‌ఎస్‌లకు పాలసముద్రంలోని నాసిన్‌ అలాగని పేర్కొన్నారు. ఇకపై యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఐఆర్‌ఎస్‌లంతా ఇక్కడినుంచే శిక్షణ తీసుకుంటారని తెలిపారు. వీరితోపాటు వరల్డ్‌ కస్టమ్స్‌ ఆర్గనైజేషన్స్‌లోని అధికారుల సదస్సులు ఇక్కడే జరుగుతాయన్నారు. పరోక్ష పన్నులు, జీఎస్టీ తదితర అంశాలపై ఏపీ ఉద్యోగులకు నాసిన్‌లో ప్రత్యేక శిక్షణనిస్తామని తెలిపారు. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక పరోక్ష పన్నుల రంగంలో అధికారుల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరమేర్పడిందని, అందుకు నాసిన్‌ లాంటి సంస్థల అవసరం ఉందని వివరించారు.

మొదటి విడతకు రూ.729కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయాలనే సంకల్పంతోనే 2014 బడ్జెట్‌లో ప్రధాని మోదీ ఆమోదంతో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నాసిన్‌కు నిధులు కేటాయించారని నిర్మల గుర్తుచేశారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైందని అన్నారు. ఈ ఏడాది మొదటి విడత నిర్మాణానికి రూ.729 కోట్లు మంజూరుచేశామని తెలిపారు. 2023 సెప్టెంబరునుంచి పాలసముద్రం క్యాంపస్‌లో పూర్తిస్థాయి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటుకు భూములిచ్చిన పాలసముద్రం, తుంగోడు గ్రామాల రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, రోడ్లు, భవనాల మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌బజాజ్‌, పరోక్ష పనులు, కస్టమ్స్‌ కేంద్ర బోర్డు ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రీ, నాసిన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఆర్‌ బరూహ్‌, అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో నిర్మల సహకారం: బుగ్గన

మొసలి నోటిలో చిక్కుకున్న గజేంద్రుడిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు శంఖుచక్రాలను ధరించకుండా ఎలాగైతే పరిగెత్తుకు వచ్చారో అలాగే ఏపీకి కష్టమొచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముందుండి సహకరించారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. నాసిన్‌ రాకతో అనంతపురం జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని వివరించారు. సంస్థ ఏర్పాటుకు ఎలాంటి సాయానికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌, సెస్‌ (సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌, ఎంహెచ్‌ఆర్డీ (మర్రిచెన్నారెడ్డి హ్యుమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌)లను కలిపి ఏపీ అకాడమీ ఆఫ్‌ గవర్నెన్స్‌ పేరుతో ఒకే సంస్థగా విశాఖపట్నంలో ఏర్పాటుచేస్తామని అన్నారు.

ఇదీ చదవండి:బకెట్‌ విధానంతో డిగ్రీ విద్య.. ఎన్ని రకాల కాంబినేషన్లో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details