దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ పంటలు... ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల తోటల సాగులో రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించడం వల్ల ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయటపడుతూ... ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా... విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం కారణంగా కలిగే దుష్ఫలితాలపై పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ - ఎన్ఐపీహెచ్ఎం ప్రాంగణంలో కొత్తగా 17.54 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పెస్టిసైడ్ ఫార్ములేషన్, రెసిడ్యూస్ అనాలసిస్ సెంటర్ - పీఎఫ్ఆర్ఏసీని దిల్లీ నుంచి వర్చువల్ వేదికగా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రం పరిధిలో దేశవ్యాప్తంగా 32 సంస్థలు పనిచేస్తాయి.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి: నరేంద్రసింగ్ తోమర్ - సేంద్రియ వ్యవసాయం వార్తలు
పంటల సాగులో విస్తృతంగా రసాయన ఎరువులు వాడటం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు.
ఏటా 180 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 5200 మంది రైతులను సేంద్రీయ, సహజ వ్యవసాయంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 14.18 కోట్ల రూపాయల వ్యయంతో బయో కంట్రోల్ ల్యాబ్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ ప్రయోగశాల 2895.20 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో... ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టు పక్కల ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ అనుబంధ జాతీయ సంస్థలు కొలువుతీరిన దృష్ట్యా... విస్తృత పరిశోధనలు, ఫలితాలు క్షేత్రస్థాయి రైతుల చెంతకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి తోమర్ సూచించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కౌలాష్ చౌదరి, కేంద్ర ఆహార సంక్షేమ శాఖ కార్యదర్శి సంయజ్, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎన్ఐపీహెచ్ఎం సేవలు రైతులకు తెలియజేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. రసాయన అవశేషాల దుష్ఫలితాలు రైతులకు తెలియజేయడం ద్వారా పంటలు నష్టపోకుండా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: కొత్త సంవత్సర వేడుకలపై సందిగ్ధత