Kishan Reddy on TRS Government: హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, భాజపాపై పథకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యం, బియ్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రి పీయూష్ గోయల్ చాలా వివరంగా పార్లమెంట్లో చెప్పారని స్పష్టం చేశారు. తానూ ఈ అంశంలో అనేకసార్లు స్పందించినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. మళ్లీ ఇవాళ.. మరో ప్రకటన కావాలని తెరాస ఎంపీలు కోరడం సరికాదన్నారు.
Kishan Reddy on Paddy Procurement: బాయిల్డ్ రైస్ విషయంలో కొంత ఇబ్బందులున్నా... రా రైస్ కొనబోమని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయికి కిలో బియ్యం రద్దు చేయడమేనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది బియ్యం సేకరణ వదిలేసి వచ్చే ఏడాది గురించి తెరాస సర్కార్ మాట్లాడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రమే ఖర్చు చేస్తుందన్న కిషన్ రెడ్డి.. రైస్ మిల్లర్ల యంత్రాలు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయదా అని ప్రశ్నించారు.
రాష్ట్రం ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం 17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రబీలో లక్ష్యంపై ఫిబ్రవరిలో రాష్ట్రాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ఇతర విత్తనాలు ఇవ్వాలని సూచించారు.