పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం సహాయ, పునరావాస కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వమే అమలు చేస్తోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ముంపు బాధితుల్లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అదనపు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించిందన్నారు. అందులో 2013 పునరావాస చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.50వేల గ్రాంట్‌తోపాటు, వారు కోల్పోయిన భూమికి సమానమైన భూమిగానీ, లేదంటే రెండున్నర ఎకరాలనుగానీ ఇందులో ఏది తక్కువైతే అది ఇస్తున్నారన్నారు. వీటికి అదనంగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ప్యాకేజీ మంజూరు చేసిందన్నారు.
ఈ అంశంపై తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు కేంద్రంలో ఏదైనా యంత్రాంగం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘సహాయ, పునరావాసాల బాధ్యత రాష్ట్రానిదే. దీని అమలు పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ కమిటీకి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ నమోదుచేసింది. వాటి పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశాం’’ అని వివరించారు.
కనకమేడల: ముంపు ప్రాంతాల్లో రెండు లక్షల మంది ఆదివాసీ బాధితులకు రూ.30 వేల కోట్లకుపైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదు. దీనిపై రాష్ట్రానికి అధికారుల బృందాలను పంపి పరిశీలించే అవకాశముందా?
మంత్రి:ముంపు బాధితులకు అవసరమైన సౌకర్యాలను కల్పించలేదని సభ్యుడు చెబుతున్నారు. కానీ... మందిరాలూ, పూజా స్థలాలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, పీహెచ్‌సీ, వెంటర్నరీ ఆసుపత్రి, జీసీసీ స్టోర్, షాపింగ్ కాంప్లెక్స్, పోస్టాఫీస్, బస్‌షెల్టర్, ఎరువుల దుకాణం, గ్రంథాలయం, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పునరావాస ప్రాంతాల్లో జరిగాయి.