తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​ అప్పుడప్పుడైనా నిజాలు చెప్పాలి.. తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లిచ్చాం'

Amit Shah in Telangana Formation Day Celebrations: దిల్లీ తెలంగాణభవన్‌లో కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రఅవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్​షా స్పష్టం చేశారు.

Union Home Minister Amit Shah in Telangana Formation Day Celebrations In Delhi
Union Home Minister Amit Shah in Telangana Formation Day Celebrations In Delhi

By

Published : Jun 2, 2022, 9:35 PM IST

Updated : Jun 3, 2022, 4:28 AM IST

'కేసీఆర్​ అప్పుడప్పుడైనా నిజాలు చెప్పాలి.. తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లిచ్చాం'

Amit Shah in Telangana Formation Day Celebrations: కేంద్ర, రాష్ట్ర సంబంధాలను తాము బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నామని, రాష్ట్రాల్లో ఉన్నది భాజపా ప్రభుత్వమా? కాదా? అన్నది ఎప్పుడూ ఆలోచించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఏ రాష్ట్రం పట్లా సవతితల్లి ప్రేమ చూపలేదని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దిల్లీకి వచ్చినా సగౌరవంగా చూశామని తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని, వచ్చిన తర్వాత హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి వల్లబ్‌భాయ్‌ పటేల్‌ చేసిన సేవను గుర్తుచేసుకుంటామని ప్రకటించారు. ఎప్పుడూ అబద్దాలే కాదని, అప్పుడప్పుడూ నిజాలూ చెప్పాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. రూ.2,52,202 కోట్లు ఏయే పద్దుల కింద, ఎప్పుడెప్పుడు ఇచ్చారో చదివి వినిపించారు. ఈ జాబితాను చదువుతూపోతే వచ్చే ఎన్నికల లెక్కింపు కూడా పూర్తవుతుందని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకాల విషయంలో సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ సాయం రూ.3.5లక్షల కోట్లను దాటిపోయి ఉండేదన్నారు. ‘‘తెలంగాణ సీఎంకు నాదొక్కటే సూచన. రాష్ట్ర ప్రజలకు కొద్దిగానైనా నిజం చెప్పండి చాలు. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా చెప్పండి’’ అని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం లేదన్నట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు.

ఆజాదీ అమృతమహోత్సవానికి కొరవడిన సహకారం
ఆజాదీకా అమృత్‌మహోత్సవం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం లభించడంలేదని అమిత్‌షా ఆరోపించారు. ‘‘ఇది భాజపా కార్యక్రమం కాదు. స్వాతంత్య్ర సమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం. దీనికి ఎలా దూరంగా ఉండగలుగుతారని’’ నిలదీశారు. ప్రతి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలనేదే తమ అకాంక్ష అని, వేర్వేరు రాష్ట్రాలు అభివృద్ధిలో వేర్వేరు మార్గాల్లో వెళ్తూ హైవేలా కలిసి భారత్‌ అభివృద్ధిని సమున్నతంగా చేసేలా సాగాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. తెలంగాణ దినదినప్రవర్థమానమై అన్ని శిఖరాలను అధిరోహించాలని ప్రార్థిస్తున్నానన్నారు.

యువత త్యాగాల గురించి మాట్లాడాల్సిందే
తెలంగాణ ఏర్పాటు కోసం అక్కడి యువత చేసిన సంఘర్షణ గురించి మాట్లాడకపోతే తన మాటలు అసంపూర్తిగా ముగిసినట్లేనని అమిత్‌షా అన్నారు. రాష్ట్రం కోసం 1200మందికిపైగా యువకులు ఆత్మత్యాగం చేశారని గుర్తుచేశారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రతి సమయంలో భాజపా మద్దతు పలికిందన్నారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో జరిపిన రాష్ట్రాల విభజన విద్వేషభావనను రగిలించింది. దాన్నుంచి బయటికి రావాలని అందరికీ పిలుపునిస్తున్నా. దేశ ఏకతా, అఖండతతోపాటు, తెలంగాణ అభివృద్ధి ద్వారా భారత్‌ను ప్రగతిపథంలో నడిపించే మహా తెలంగాణను నెలకొల్పేందుకు అందరూ ప్రయత్నించాలి’’ అని పిలుపునిచ్చారు.

పటేల్‌ లేకపోతే భారత చిత్రపటం ఇలా ఉండేదికాదు
‘‘సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌కు మనందరం రుణపడి ఉన్నాం. ఆయన లేకపోతే భారత చిత్రపటం ఇలా ఉండేదికాదు. నిజాం పాలన నుంచి విముక్తి కల్పించడానికి ఆయన చేసిన కృషికి కేవలం హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలే కాకుండా దేశం మొత్తం రుణపడి ఉంది. అయినా హైదరాబాద్‌ విమోచన దినం నిర్వహించుకోలేని పరిస్థితి ఉండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా దాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఆజాదీకా అమృతమహోత్సవంలో సమ్మిళితం చేసి దేశంలోని అత్యంత యువ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పినందుకు కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అక్కడి సంస్కృతి, సాహిత్యం, సంగీతం, వేషభాషలు, వారసత్వపరంపర ఇలాగే వేల ఏళ్లపాటు వెలుగొందుతూ భారతమాత మణిమకుటంపై విరాజిల్లాలని కోరుకుంటున్నా’’ అంటూ అమిత్‌షా ప్రసంగాన్ని ముగించారు.

తెలంగాణకు రూ. 2.52 లక్షల కోట్లు ఇచ్చాం..

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న సూత్రాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నాం. అందుకే 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.2,52,202 కోట్లు ఖర్చుచేసింది. ఇంత చేసినా, చేయలేదని అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదు. ఇంతచేసినా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, వివక్ష చూపతున్నారని అక్కడి పాలకులు దుష్ప్రచారం చేస్తున్నట్లు నాకు తెలుసు. అందుకే ఈ విషయాలను హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు చెప్పినప్పటికీ, మరోసారి పునరుద్ఘాటిస్తున్నా.- హోంమంత్రి అమిత్‌షా

ఇవీ చూడండి:

Last Updated : Jun 3, 2022, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details