తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Bifurcation Issues: విభజన అంశాలపై కీలక ముందడుగు.. పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సమాయత్తం - ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు

AP Bifurcation Issues: విభజన అంశాలు మరోమారు తెరపైకి వచ్చాయి. కేంద్ర హోంశాఖ వచ్చే నెల 12న నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన అంశాలపై చర్చ జరగనుంది. అపరిష్కృతంగా ఉన్న అంశాలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజనతో పాటు విద్యుత్ బకాయిలు లాంటి అంశాలు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి.

AP Bifurcation Issues
union home affairs

By

Published : Dec 31, 2021, 4:34 PM IST

AP Bifurcation Issues: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. సమస్యల పరిష్కారం దిశగా వచ్చే నెల 12న కీలక సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దిల్లీలో భేటీ కానున్నారు. పరిష్కారం కాకుండా, పీఠముడి పడిన సమస్యలపై ఈ భేటీలో చర్చిస్తారు. పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తారు.

ఈ ఏడాది ఏప్రిల్ 7న విభజన అంశాలపై కేంద్రహోంశాఖ సమావేశం నిర్వహించింది. వర్చువల్ విధానంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన అజయ్ భల్లా.. సమస్యలు, వాటి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు లాంటి అంశాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఓ కొలిక్కి రావడం లేదు.

తెలంగాణకు.. సింగరేణి, ఏపీకి.. అప్మెల్​..

సింగరేణి కార్పొరేషన్​తో పాటు సంస్థకు అనుబంధంగా ఏపీలో ఉన్న ఆంధ్రప్రదేశ్​ హెవీ మిషనరీ అండ్​ ఇంజినీరింగ్​ లిమిటెడ్​- అప్మెల్ విభజన వ్యవహారంలో ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చారు. దీంతో ఏజీ సలహాను తమకు పంపిస్తే పరిశీలించి అభిప్రాయం చెబుతామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు.

షీలాబిడే కమిటీ సిఫారసుల్లో..

AP Bifurcation Act: తొమ్మిదో షెడ్యూల్​లోని సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటీ సిఫారసుల్లో అభ్యంతరం లేని వాటిపై ముందుకెళ్లి.. మిగతా వాటి విషయంలో విడిగా చర్చించాలని తెలంగాణ చెబుతోంది. అయితే అన్ని సంస్థల విషయంలో ఒకే విధంగా ముందుకెళ్లాలని ఏపీ అంటోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మిగతా వాటి విషయంలో షీలాబిడే కమిటీ సిఫారసుల ప్రకారం ముందుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

పదో షెడ్యూల్​ సంస్థల విభజనపై..

ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ తదితర పదో షెడ్యూల్​లోని సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. దీంతో ఈ విషయమై న్యాయసలహా తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ గతంలోనే తెలిపింది. దిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది.

విద్యుత్​ సమస్యలపై..

విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణ నుంచి తమకు రూ.7,500 కోట్లు రావాలని ఏపీ అంటోంది. విద్యుత్ బకాయిల విషయంలో ఏపీతో చర్చించి పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమేనన్న తెలంగాణ... అయితే ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన కేసును ఏపీ ఉపసంహరించుకోవాలని కోరింది. ఏపీ నుంచి తమకూ కొంత మొత్తం రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. నిర్దిష్ట గడువులోగా బకాయిల చెల్లింపుల విషయమై అండర్​ టేకింగ్​ ఇస్తే.. కేసు ఉపసంహరించుకునేందుకు తాము సిద్ధమేనని ఏపీ చెబుతోంది.

ఈ అంశాలపైనా చర్చ..

వీటితో పాటు విభజన చట్టంలో పన్ను సంబంధిత అంశాలు, చట్టంలో పొందుపరచని సంస్థల విభజన, బ్యాంకు డిపాజిట్లలో ఉన్న నగదు విభజన తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. గత నవంబర్ నెలలో తిరుపతి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వినిపించాయి. తాజాగా వచ్చే నెల 12న జరగనున్న సమావేశంలో ఈ అంశాలపై మరోమారు చర్చ జరగనుంది.

ఇదీచూడండి:Azadi Ka Amrit Mahotsav: స్వయంపాలన కాదు.. సంపూర్ణ స్వరాజ్యం కోసం..!

ABOUT THE AUTHOR

...view details