తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సర్కార్​కు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ, మీవన్నీ ఆర్థిక ఉల్లంఘనలని వ్యాఖ్య - Central Govt on AP Financial Issues

Central Govt on AP Financial Issues మద్యం, వివిధ విషయాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తప్పుబట్టారు. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)ను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు. వాటిపై చర్చించడానికి 25వ తేదీన దిల్లీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 22న ఘాటుగా లేఖ రాశారు.

Central Govt on AP debts
కేంద్ర ఆర్థిక శాఖ

By

Published : Aug 25, 2022, 10:52 AM IST

Central Govt on AP Financial Issues : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గించి, దాన్ని స్పెషల్‌ మార్జిన్‌ పేరిట ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని తాకట్టు పెట్టి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రుణాలు సేకరించడాన్ని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తప్పుబట్టారు. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)ను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు.

Central Govt on AP debts : దీంతోపాటు వివిధ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమీ బాగా లేదని, వాటిపై చర్చించడానికి 25వ తేదీన దిల్లీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 22న ఘాటుగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, ఎంపీ విజయసాయిరెడ్డి, మరో 10 శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలన్న దానిపై బుధవారం ఇక్కడ ఏపీభవన్‌లో కూర్చొని కసరత్తుచేశారు. ఇవీ కేంద్రం సంధించిన ప్రశ్నలు..

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా అప్పులు ఎలా?
సామాజిక, ఆర్థిక కార్యక్రమాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీ) ద్వారా ఈ ఏడాది జూన్‌లో 9.62% వడ్డీతో రూ.8,305 కోట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బేషరతు గ్యారెంటీ ద్వారా వీటిని జారీ చేసినట్లు మాకు తెలిసింది. ఇదివరకు వివిధ మద్యం రకాలపై వ్యాట్‌ 130% నుంచి 190% వరకు ఉండేది. 2021 నవంబరులో దాన్ని 35% నుంచి 60% వరకు తగ్గించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.

అయితే ఆ తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా, అదనపు స్పెషల్‌ మార్జిన్‌ పేరిట పాత ఎంఆర్‌పీని అలాగే కొనసాగిస్తూ జీవో విడుదల చేసింది. ఇలా విధించిన స్పెషల్‌ మార్జిన్‌ను ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2022 ద్వారా 2021 నవంబరు 9 నుంచి ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యంపై సుంకాన్ని (రాష్ట్ర ఆదాయాన్ని) ప్రత్యేక మార్జిన్‌గా మార్చి దానికి కార్పొరేషన్‌ ఆదాయంగా పేరుపెట్టింది. సంక్షేమ పథకాల అమలుకోసం ఆ మార్జిన్‌ను తాకట్టుపెట్టి ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా రుణాలు తీసుకుంది. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నికర రుణ పరిమితిని బైపాస్‌ చేయడమే అవుతుంది.

రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వరా?
రైల్వేశాఖ వ్యయ వాటా పంపిణీ పద్ధతిలో ఏపీలో ఏడు ప్రాజెక్టులు చేపడుతోంది. అయితే రాష్ట్రం రూ.3,558 కోట్లను పెండింగ్‌లో పెట్టడంతో ఇప్పుడవన్నీ తీవ్రంగా సతమతమవుతున్నాయి. ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేయాలంటే 2,348 హెక్టార్ల భూమిని సత్వరమే అందించాలి. 123.72 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించాల్సి ఉంది. 100% రైల్వే నిధులతో వివిధ ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన భూసేకరణ, అక్కడున్న పౌర సౌకర్యాల తరలింపును ఏపీ ప్రభుత్వం చేపట్టలేదు.

ఒప్పందం ప్రకారం నివేదికలు ఇవ్వరేం?
విద్యుత్తురంగంలో కనబరిచిన పనితీరు ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ.3,716 కోట్లమేర అదనపు రుణాలకు అనుమతి ఇచ్చాం. ఆ సమయంలో రాష్ట్రం సంతకం చేసిన ఒప్పందం ప్రకారం వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర సంస్థలు, విద్యుత్తు విక్రయదారులకు నెలవారీగా డిస్కంలు చెల్లించాల్సిన అప్పులకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలి. 2022 జనవరి 31 నుంచి ప్రతినెలా అప్పులు పెరిగాయా? తగ్గాయా? అన్నది చెబుతూ ప్రతినెలా కేంద్ర విద్యుత్తుశాఖకు నివేదిక సమర్పించడంతోపాటు, కేంద్ర ఎక్స్‌పెండిచర్‌ విభాగానికి దాని ప్రతిని అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాకు ఎలాంటి నివేదికా అందలేదు.

విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపు ఎప్పుడు?
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్‌కోలు కాకుండా మిగిలిన విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఏపీ రూ.10,109 కోట్ల బకాయి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పునరుత్పాదక ఇంధన సంస్థలు, స్వతంత్ర విద్యుత్తు సంస్థలూ ఉన్నాయి. వివిధ డిస్కంలకు రాష్ట్రం నుంచి రూ.9,116 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అలాగే సబ్సిడీల రూపంలో ఇచ్చిన రూ.3,178 కోట్ల బకాయిలనూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అవి ఎప్పుడిస్తారు?

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు సహకారం:విశాఖ స్టీల్‌, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్రం 2021 జనవరి 27న నిర్ణయించింది. పరిశ్రమలో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేకపోయినా వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, దాని మద్దతును కోరింది. ఈ లావాదేవీలు సున్నితంగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మద్దతు చాలా కీలకం.

ప్రైవేటీకరణ తర్వాత పెరిగిన సామర్థ్యంతో ప్లాంట్‌ విశాఖలోనే ఉంటుంది. ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే 2.5 నుంచి 3 రెట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా భారీ పెట్టుబడులు తేవడమే ప్రైవేటీకరణ ఉద్దేశం. ఇదే సమయంలో ప్లాంట్‌కు సంబంధించిన మిగులు భూమిని పక్కనపెట్టి పెరుగుతున్న నగర అవసరాలకు కేటాయించడానికి వీలవుతుంది.

వెనుకబడిన జిల్లాల నిధులపై ధ్రువీకరణ పత్రాలేవీ?

విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇప్పటివరకూ రూ.1,750 కోట్లు విడుదల చేశాం. 2020-21, 2021-22ల్లో కేంద్రం విడుదల చేసిన రూ.700 కోట్లకు రాష్ట్రం ఇంతవరకు నీతి ఆయోగ్‌కు వినియోగ ధ్రువీకరణ పత్రాలు(యూసీ) చెల్లించలేదు.

కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల విడుదలేదీ?

2020-21 నుంచి 2022-23 వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రూ.3,824 కోట్లను విడుదల చేశాం. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ మొత్తాన్ని ఆయా పథకాలను అమలుచేసే సంస్థలకు విడుదల చేయలేదు. దీనికితోడు కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం సమకూర్చాల్సిన వాటాను కూడా ఏపీ విడుదల చేయలేదు. ఇది కేంద్ర పథకాల అమలును తీవ్ర ప్రభావితం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details