తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనటం అవాస్తవం: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman: తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనడం అవాస్తవమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొననారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వటమనేది కుదరదని తెలిపారు. హైదరాబాద్‌ భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్‌ కేంద్రం వసూలు చేసిన సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చామని తేల్చిచెప్పారు.

Nirmala Sitharaman
Nirmala Sitharaman

By

Published : Sep 3, 2022, 6:33 PM IST

Updated : Sep 3, 2022, 8:15 PM IST

Nirmala Sitharaman: ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఒక్కరి పేరే ఎలా పెట్టుకుంటారని ఆమె ప్రశ్నించారు. కేంద్రం వాటా ఇస్తున్న వాటిలో తమ ఫొటో ఉండాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేటీఆర్‌ ట్వీట్‌పై కూడా నిర్మలా సీతారామన్‌ విరుచుకుపడ్డారు. పన్నుల రూపంలో తామే అధికంగా కేంద్రానికి ఇస్తున్నామనడంపై మండిపడ్డారు. కేంద్రం.. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన డీపీఆర్‌ లేదని, రూ.1.40లక్షల కోట్లు ఖర్చుపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా డీపీఆర్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలకు వివరించేందుకే క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నామని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనటం అవాస్తవం: నిర్మలాసీతారామన్‌

'తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏమీ చేయట్లేదనటం అవాస్తవం. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులుంటాయి. ఇష్టమున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వటమనేది కుదరదు. కేంద్రం వసూలు చేసే సెస్సులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయి. వసూలు చేసిన సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చాం. ఇచ్చిన ప్రతి పైసాను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తాం. బడ్జెటేతర అప్పులు ఎక్కువ చేస్తే ఏ రాష్ట్రానికైనా నష్టమే. తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా రూ.1.25లక్షల అప్పు ఉంది. -నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

పార్టీలు ఇచ్చే ఉచితాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ బదులిస్తూ.. పార్టీల ఉచితాల అంశంపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రెవెన్యూ ఆధారంగానే పథకాలు ఉండాలని చెప్పారు. ఏ రాష్ట్రమైనా అప్పులు తీర్చే రాబడిని చూపించి అప్పులు చేయాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ ఆశావహంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. చాలా దేశాల్లో ప్రస్తుతం ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోందన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 3, 2022, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details