దేశవ్యాప్తంగా విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ.. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌కు మాత్రం నిరంతరాయ కరెంట్ సరఫరా(Uninterruptible power supply)కు ఢోకా లేదని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి నగరానికి కరెంట్ సరఫరా అవుతోంది. ఒకవేళ ఎక్కడైనా సమస్య తలెత్తినా ఇతర కేంద్రాల నుంచి సరఫరాకు ఆటంకాలు లేకుండా హైదరాబాద్ చుట్టూ ఉన్న విద్యుత్తు వలయం(గ్రిడ్) ఆదుకుంటోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక 400 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు ఒక గ్రిడ్ ఏర్పాటు చేయగా.. అక్కడి నుంచి కరెంట్‌ను స్టెప్‌డౌన్ చేసి సరఫరా చేసే 220కేవీ ఉపకేంద్రాలను కలిపి ట్రాన్స్‌కో మరో గ్రిడ్ ఏర్పాటు చేసింది. ఇదే నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు దోహదపడుతోంది.
లోడ్ బదలాయింపులో కీలకం
రాజధానికి కావాల్సిన కరెంట్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో థర్మల్(బొగ్గు), హైడల్(జల విద్యుత్తు) కేంద్రాల నుంచి నగరానికి అవుతోంది. ఆయా కేంద్రాల నుంచి విద్యుత్తును మొదట 765 కేవీ సామర్థ్యం కల్గిన ఈహెచ్‌టీ ఉపకేంద్రాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి సామర్థం తగ్గించి(స్టెప్‌డౌన్) 400కేవీ ఉపకేంద్రాలకు తరలిస్తారు. ఈ కేంద్రాలు నగరం చూట్టూ ఏడు ఉన్నాయి. వీటన్నింటిని ఒక వలయంగా కలిపారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, సరఫరాకు సమస్యలు రాకుండా విద్యుత్తు వలయం ఆదుకుంటోంది. ఇటీవల మామిడిపల్లి 400కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన ట్రాన్స్‌కో అధికారులు ఈ ఉపకేంద్రం పరిధిలోని లోడ్‌ను గ్రిడ్ ఆధారంగా ఇతర ఉపకేంద్రాలకు బదలాయించడంతో అంతరాయాలు లేకుండా బయటపడ్డాం.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
- మహేశ్వరం, మామిడిపల్లి, ఘన్‌పూర్, మల్కారం, గజ్వేల్, శంకర్‌పల్లి, కేతిరెడ్డిపల్లిలో 400కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా రాయదుర్గంలో మరొకటి నిర్మాణంలో ఉంది.
- శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి అయిన కరెంట్ స్టెప్‌డౌన్ తర్వాత డిండి.. అక్కడి నుంచి మహేశ్వరం, మామిడిపల్లి ఉపకేంద్రాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది.
- రామగుండం ఎన్‌టీపీసీ నుంచి గజ్వేల్, మల్కారంకు వస్తుంది. ః కాకతీయ(కేటీపీఎస్) నుంచి గజ్వేల్, ఖమ్మం మీదుగా మామిడిపల్లికి చేరుతుంది. ః కొత్తగూడెం నుంచి నేరుగా షాపూర్‌నగర్ 220కేవీకి వస్తుంది. ః వార్ధా నుంచి శంకర్‌పల్లికి వెళుతోంది. ఈ లైన్ల సామర్థ్యం 5 వేల మెగావాట్లు. ఎక్కడైనా రెండు మూడింటిలో సమస్య తలెత్తినా అంతరాయాలు లేకుండా లోడ్‌ను ఇతర కేంద్రాలకు మార్చి కరెంట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.