MP RAGHURAMA:హైదరాబాద్లోనివైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఇవాళ ఉదయం ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. వెంటనే గుర్తించిన రఘురామ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. విజయవాడ నుంచి వచ్చినట్లు ఆ అగంతకుడు చెప్పాడని సిబ్బంది తెలిపారు. అతడి పేరు సుభాన్ అలియాస్ బాషగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు దుండగులు వచ్చారని.. అందులో ఒకరిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు రఘురామ సిబ్బంది చెప్పారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఏపీలోని భీమవరం పర్యటనకు తాను హాజరుకాలేనని రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఆయన దిగిపోయారు. ఈ క్రమంలో తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘‘భీమవరంలో నా అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులుండటంతో సుమారు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారు. నేను భీమవరం వెళ్లకపోతే వాళ్లను వదిలేస్తామని పోలీసులు చెప్పారు. తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నా. నా కోసం ఎవరూ భీమవరం రావొద్దు’’ అని రఘురామ అందులో పేర్కొన్నారు.
ఆ జాబితాలో చేర్చలేదు..: ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనకు లేఖ రాశారు. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న తన పేరును అధికారులు ఆ జాబితాలో చేర్చలేదని.. తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని రఘురామ పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలన్నారు. కానీ తనకు ఆహ్వానం లేకపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి :అల్లూరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం: చంద్రబాబు